ElonMusk : ఎలాన్ మస్క్ కొత్త ప్లాన్.. రోబోటాక్సీతో ట్రాన్స్ పోర్ట్ ముఖచిత్రం మారనుందా?
రోబోటాక్సీతో ట్రాన్స్ పోర్ట్ ముఖచిత్రం మారనుందా?;
ElonMusk : టెస్లా సంస్థ డ్రైవర్‌లెస్ భవిష్యత్తు వైపు మరో అడుగు వేస్తోంది. త్వరలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తమ రోబోటాక్సీ సర్వీసును ప్రారంభించవచ్చు. ఇది రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. రోబోటాక్సీ అంటే మనుషులు డ్రైవ్ చేయకుండా, పూర్తిగా ఆటోమేటిక్‌గా నడిచే టాక్సీ సర్వీసు. ఈ ట్యాక్సీలు వాటంతట అవే మార్గాన్ని గుర్తించి, ప్రయాణికులను గమ్యస్థానానికి చేరవేస్తాయి. ఇందులో డ్రైవర్ ఉండడు, మనుషుల ప్రమేయం కూడా ఉండదు.
ఈ కొత్త రోబోటాక్సీ సర్వీసు మారిన్ కౌంటీ, శాన్ ఫ్రాన్సిస్కో, ఈస్ట్ బే, సౌత్ బే వంటి పెద్ద ప్రాంతంలో నడిచే అవకాశం ఉంది. మొదటగా ఈ ప్రాంతంలోని కొంతమంది టెస్లా కార్ ఓనర్లకు ప్రత్యేక ఆహ్వానాలు పంపి, వారికి ఈ సర్వీస్ అనుభవించే అవకాశం ఇవ్వవచ్చు. అయితే, టెస్లా ఇంకా ఈ లాంచ్‌ను అధికారికంగా ధృవీకరించలేదు, కాబట్టి ఈ సర్వీసు ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం.
టెస్లా గతంలో ఆస్టిన్, టెక్సాస్‌లో చిన్నపాటి రోబోటాక్సీ ట్రయల్ చేసింది. అక్కడ చాలా నియంత్రిత పరిస్థితులలోనే ఈ టాక్సీలను నడిపారు. ఇప్పుడు కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కోలో దీన్ని పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేసి రోబోటాక్సీలు నడపడానికి టెస్లాకు కాలిఫోర్నియాలోని డీఎంవీ (Department of Motor Vehicles), సీపీయూసీ (California Public Utilities Commission) నుంచి అనేక అనుమతులు తీసుకోవాలి. టెస్లా ఇంకా అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించలేదని డీఎంవీ స్పష్టం చేసింది. ఏ సర్వీసును ప్రారంభించడానికి ముందు అయినా కంపెనీ చట్టపరమైన అనుమతులు పొందడం తప్పనిసరి.
టెస్లా రోబోటాక్సీ సర్వీసు భవిష్యత్ రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చగలదు. టెక్నికల్ గా ఇది రెడీగా ఉన్నప్పటికీ, చట్టపరమైన అనుమతులు, ప్రభుత్వ నిబంధనలు ఇంకా పెద్ద సవాలుగా ఉన్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే, త్వరలోనే టెస్లా రోబోటాక్సీలు శాన్ ఫ్రాన్సిస్కో రోడ్లపై పరుగులు తీయవచ్చు.