EV Sales : ఈవీ మార్కెట్లో సునామీ..పెట్రోల్ కార్ల పని అయిపోయినట్లేనా? ఫిబ్రవరి లెక్కలు చూస్తే భయం వేయాల్సిందే
ఫిబ్రవరి లెక్కలు చూస్తే భయం వేయాల్సిందే
EV Sales :భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 2026లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన ఏకంగా 44 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈసారి మొత్తం 13,733 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జనవరి 2026తో పోలిస్తే మాత్రం విక్రయాల్లో కొంత తగ్గుదల కనిపించింది. జనవరిలో 18,470 కార్లు అమ్ముడవగా, ఫిబ్రవరిలో ఆ సంఖ్య 25.65 శాతం తగ్గింది. సాధారణంగా జనవరిలో ఉండే భారీ డిమాండ్ తర్వాత ఫిబ్రవరిలో మార్కెట్ కొంచెం నెమ్మదించడం సహజమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టాటా మోటార్స్ టాప్
ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 2026లో టాటా ఏకంగా 5,568 ఈవీలను విక్రయించింది. ఇది గత ఏడాది ఫిబ్రవరి (4,020 యూనిట్లు) కంటే 38.51 శాతం ఎక్కువ. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన వృద్ధిని మహీంద్రా నమోదు చేసింది. ఫిబ్రవరి 2025లో కేవలం 508 కార్లు అమ్మిన మహీంద్రా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,913 యూనిట్లను విక్రయించి ఏకంగా 473.43 శాతం వృద్ధిని సాధించింది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ 3,312 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది.
టెస్లా, విన్‌ఫాస్ట్ ఎంట్రీ
భారత ఈవీ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన కంపెనీలు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ ఫిబ్రవరిలో 384 కార్లను విక్రయించగా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెస్లా 29 కార్లను డెలివరీ చేసింది. చైనా దిగ్గజం బీవైడీ 306 యూనిట్లతో 10 శాతం వృద్ధిని కనబరిచింది. దేశీయ దిగ్గజం మారుతి సుజుకి కూడా ఈ రేసులో చేరి 214 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం విశేషం. అయితే హ్యుందాయ్ విక్రయాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 60 శాతం మేర పడిపోయి 304 యూనిట్లకు పరిమితమయ్యాయి.
లగ్జరీ సెగ్మెంట్లోనూ ఈవీ జోరు
ధనిక వర్గాలను ఆకర్షించే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో బీఎమ్‌డబ్ల్యూ అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో బీఎమ్‌డబ్ల్యూ 245 కార్లను విక్రయించగా, మెర్సిడెస్ బెంజ్ 65 యూనిట్లను, వోల్వో 25 యూనిట్లను విక్రయించాయి. కియా మోటార్స్ కూడా భారీ వృద్ధిని సాధించింది; గత ఏడాది కేవలం 22 కార్లు అమ్మిన కియా, ఈసారి 295 యూనిట్లను విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నప్పటికీ, పర్యావరణ స్పృహ పెరుగుతుండటంతో ఈవీల వాటా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఫాడా పేర్కొంది.