Hyundai : స్విఫ్ట్‌కు గట్టి పోటీ ఇచ్చిన కారుకు గుడ్ బై..18 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..బుకింగ్స్ క్లోజ్
18 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..బుకింగ్స్ క్లోజ్
Hyundai : హ్యుందాయ్ మోటార్స్ తన ఐకానిక్ హ్యాచ్‌బ్యాక్ i10 ఉత్పత్తిని యూరప్, యూకే మార్కెట్లలో అధికారికంగా నిలిపివేసింది. సుమారు 18 ఏళ్ల పాటు చిన్న కార్ల విభాగంలో రారాజుగా వెలిగిన ఈ కారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ధాటికి తలవంచక తప్పలేదు. ప్రస్తుతం యూరప్ లో అమలవుతున్న కఠినమైన ఉద్గార నియమాలను పాటించడం పెట్రోల్ కార్లకు ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. అందుకే లాభాలు తగ్గుతున్న క్రమంలో హ్యుందాయ్ ఈ మోడల్‌ను పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కొత్త ఆర్డర్లు తీసుకోవడం కంపెనీ నిలిపివేసింది.
హ్యుందాయ్ i10 ప్రధానంగా తుర్కియేలోని ఇజ్మిత్ ప్లాంట్‌లో తయారయ్యేది. ఇప్పుడు ఈ ప్లాంట్‌ను అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చేందుకు హ్యుందాయ్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆగస్టు 2026 నాటికి ఇక్కడ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు బయటకు రానున్నాయి. దీనివల్ల i10 వంటి పెట్రోల్ మోడళ్లకు అక్కడ చోటు లేకుండా పోయింది. హుండై తన కొత్త ఎంట్రీ లెవల్ ఈవీ ఇన్‌స్టర్ పై ఇప్పుడు పూర్తి దృష్టి పెట్టింది.
ఇండియాలో పరిస్థితి ఏంటి?
భారతీయ కస్టమర్లు మాత్రం ఇప్పటికిప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత మార్కెట్ లో విక్రయించబడేది Grand i10 Nios. ఇది యూరప్ మోడల్ కంటే భిన్నమైనది. ఇండియాలో హ్యుందాయ్ i10 బ్రాండ్ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్ గా నడుస్తోంది. ఇటీవల ఈ కారు భారత్ లో, ఎగుమతుల్లో కలిపి 3.3 మిలియన్ల (33 లక్షలు) అమ్మకాల మైలురాయిని అధిగమించింది. ఇందులో 20 లక్షలకు పైగా కార్లు కేవలం మన దేశంలోనే అమ్ముడయ్యాయి. మారుతి స్విఫ్ట్, టాటా టియాగో వంటి కార్లకు ఇది ఇప్పటికీ గట్టి పోటీనిస్తోంది.
ధర, ఫీచర్లు
భారతదేశంలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ప్రారంభ ధర రూ.5.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది సిఎన్‌జి ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యూరప్ లో i10 కథ ముగిసినా, ఇండియాలో మాత్రం ఇది మరికొన్నేళ్ల పాటు కొనసాగుతుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇండియాలో కూడా కఠినమైన BS-7 నియమాలు వస్తే అప్పుడు పరిస్థితి మారవచ్చు.