EV Battery : ఛార్జింగ్ పెడితే చాలు మండిపోతున్న ఈవీ స్కూటర్లు.. బ్యాటరీ పేలుళ్ల వెనుక అసలు రహస్యం ఇదే

బ్యాటరీ పేలుళ్ల వెనుక అసలు రహస్యం ఇదే

Update: 2026-07-18 14:33 GMT

EV Battery : భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం కావడం, పెట్రోల్ ధరల మంట నుంచి ఉపశమనం లభించడంతో మధ్యతరగతి ప్రజలు ఈవీల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే, దీనితో పాటే ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా తగలబడిపోవడం లేదా ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీలు పేలిపోవడం వంటి భయానక సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. ఇలాంటి వార్తలు విన్నప్పుడు అసలు నడుస్తున్న కారు లేదా స్కూటర్ లోని బ్యాటరీ ఎందుకు పేలుతుందనే సందేహం అందరిలోనూ వస్తుంది. దీని వెనుక ఒక నిర్దిష్టమైన శాస్త్రీయ కారణం దాగి ఉంది.

ఏమిటీ థర్మల్ రన్‌అవే ?

ఎలక్ట్రిక్ స్కూటర్లలో సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి ఒకే పెద్ద బ్యాటరీలా కనిపించినప్పటికీ, లోపల వందల సంఖ్యలో చిన్న చిన్న సెల్స్ కలిసి ఉంటాయి. ఏదైనా సాంకేతిక లోపం వల్ల లేదా బయటి వేడి వల్ల అందులోని ఒక చిన్న సెల్ పరిమితికి మించి వేడెక్కినప్పుడు, ఆ వేడి బయటకు పోవడానికి మార్గం లేకపోతే థర్మల్ రన్‌అవే అనే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో బ్యాటరీ లోపల రసాయన చర్యలు అదుపుతప్పి అత్యంత వేగంగా జరిగిపోతాయి. దీనివల్ల ఉష్ణోగ్రత నిరంతరం పెరిగిపోతూ, ఆ ఒక్క సెల్ లోని వేడి పక్కనే ఉన్న మిగతా సెల్స్ కు కూడా వ్యాపిస్తుంది. సమయానికి ఈ ప్రక్రియ ఆపకపోతే మొత్తం బ్యాటరీ ఓవర్ హీట్ అయిపోయి క్షణాల్లో అంటుకుంటుంది లేదా తీవ్రస్థాయిలో పేలిపోతుంది.

లోకల్ ఛార్జర్లు, ఓవర్ ఛార్జింగ్‌తో పొంచి ఉన్న పెను ముప్పు

ఈవీ బ్యాటరీలలో మంటలు రావడానికి కేవలం ఒక్క కారణమే బాధ్యత వహించదు, దీని వెనుక చాలా అంశాలు ఉంటాయి. మార్కెట్లో దొరికే నాణ్యత లేని చౌకబారు బ్యాటరీలను వాడటం, బలహీనమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉండటం ప్రధాన కారణాలు. దీనికి తోడు చాలామంది రాత్రంతా స్కూటర్లను ఛార్జింగ్ కి వదిలేస్తుంటారు, ఇలా ఓవర్ ఛార్జింగ్ చేయడం లేదా ఒరిజినల్ ఛార్జర్ కాకుండా లోకల్ మార్కెట్లో దొరికే డూప్లికేట్ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల బ్యాటరీలపై విపరీతమైన ఒత్తిడి పడి ముప్పు వాటిల్లుతుంది. అలాగే ఎండకాలంలో కారు లేదా స్కూటర్ ను నిప్పులు చెరిగే ఎండలో గంటల తరబడి పార్క్ చేయడం, బాగా వేడిగా ఉన్న ప్రదేశాలలో ఛార్జింగ్ పెట్టడం వల్ల కూడా బ్యాటరీ ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.

బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ విఫలమైతే జరిగే నష్టం ఇదే

ఎలక్ట్రిక్ వాహనాలలో అన్నింటికంటే కీలకమైన రక్షణ కవచం బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్(BMS). దీనిని బ్యాటరీకి ఒక మెదడు లాంటిదిగా చెప్పవచ్చు. ఇది బ్యాటరీ ఉష్ణోగ్రతను, వోల్టేజ్ హెచ్చుతగ్గులను, ఛార్జింగ్ ప్రక్రియను ప్రతి సెకను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఒకవేళ కరెంట్ ఎక్కువగా వస్తే ఛార్జింగ్‌ను ఆటోమేటిక్‌గా నిలిపివేసి, అన్ని బ్యాటరీ సెల్స్ సమానంగా ఉండేలా చూస్తుంది. ఒకవేళ ఈ బీఎమ్ఎస్ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే, బ్యాటరీ లోపల జరిగే మార్పులను గుర్తించలేము. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి నేరుగా థర్మల్ రన్‌అవేకి దారితీస్తుంది.

యాక్సిడెంట్లు జరిగినప్పుడు జాగ్రత్త

వాహనదారులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్కూటర్ ఎప్పుడైనా ప్రమాదానికి గురై కింద పడినప్పుడు పైన ఎలాంటి డ్యామేజ్ కనిపించకపోవచ్చు. కానీ లోపల ఉండే బ్యాటరీ ప్యాక్ కి అంతర్గతంగా దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ అంతర్గత డ్యామేజ్ వల్ల లోపల కెమికల్స్ లీక్ అవ్వడం లేదా సెల్స్ ఒకదానికొకటి నలగడం జరుగుతుంది. ఇది జరిగిన వెంటనే కాకపోయినా, కొన్ని రోజుల తర్వాత ఛార్జింగ్ పెడుతున్నప్పుడో లేదా బండి నడుపుతున్నప్పుడో అకస్మాత్తుగా మంటలు రావడానికి కారణమవుతుంది.

ఈవీ రైడర్స్ అలర్ట్.. బ్యాటరీ బ్లాస్ట్ కాకుండా ఉండాలంటే పాటించాల్సిన 6 గోల్డెన్ రూల్స్

* మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నట్లయితే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇటువంటి పెద్ద ప్రమాదాల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు:

* ఎల్లప్పుడూ కంపెనీ వారు అందించిన ఒరిజినల్ ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించండి, లోకల్ ఛార్జర్ల జోలికి వెళ్లకండి.

* లాంగ్ రైడ్ పూర్తి చేసిన వెంటనే కారు లేదా స్కూటర్ వేడిగా ఉంటుంది, కాబట్టి వెంటనే ఛార్జింగ్ పెట్టకుండా కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు బ్యాటరీని చల్లబరచండి.

* స్కూటర్ ను మండుతున్న ఎండలో లేదా గాలి ఆడని ఇరుకైన వేడి గదులలో ఛార్జ్ చేయకండి.

* ఛార్జింగ్ అవుతున్న సమయంలో ఎక్కువ సమయం పాటు వాహనాన్ని ఒంటరిగా లేదా ఎవరూ గమనించకుండా వదిలేయకండి.

* మీ బ్యాటరీ ఏమాత్రం ఉబ్బినట్లు కనిపించినా, పగుళ్లు వచ్చినా లేదా వింత వాసన వస్తున్నా వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి చెక్ చేయించండి.

* బ్యాటరీ రిపేర్ లేదా మార్పులను సొంతంగా మెకానిక్ షాపుల్లో చేయించకుండా, కంపెనీ గుర్తింపు పొందిన టెక్నీషియన్ల ద్వారానే చేయించండి.

* సరైన సంరక్షణ, సురక్షితమైన ఛార్జింగ్ పద్ధతులు, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక రావడమే కాకుండా, బ్యాటరీ బ్లాస్ట్ వంటి ఘోర ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చు.

Tags:    

Similar News