Fuel Crisis : ఇంధన సంక్షోభంలోనూ తగ్గని జోరు.. సీఎన్‌జీ వాహనదారులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్

సీఎన్‌జీ వాహనదారులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్

Update: 2026-03-14 10:00 GMT

Fuel Crisis : పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అయితే, ఈ సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సీఎన్‌జీ వాహనదారులకు వరంగా మారింది. ఇంధన కొరత ఏర్పడినా, ధరలు పెరిగినా సామాన్యుడి రవాణాకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎన్‌జీ వాహనాలను వీఐపీల జాబితాలో చేర్చింది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్లే సీఎన్‌జీ కార్లు నిజంగానే రాజసం ఒలకబోస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం.. గ్యాస్ సరఫరాలో ఒక ప్రాధాన్యత జాబితా ఉంటుంది. ఇందులో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ రంగానికి మొదటి స్థానం ఇచ్చారు. అంటే, గ్యాస్ కొరత ఏర్పడితే ముందుగా పరిశ్రమలకు, విద్యుత్ కేంద్రాలకు సరఫరా తగ్గించి.. ఆ గ్యాస్‌ను ఇళ్లలోని వంటగ్యాస్ కనెక్షన్లకు, వాహనాల సీఎన్‌జీ బంకులకు మళ్లిస్తారు. యుద్ధం వల్ల విదేశాల నుంచి దిగుమతులు తగ్గినా, మన దేశంలోని కృష్ణా-గోదావరి బేసిన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే గ్యాస్‌ను ముందుగా మీ కారు ట్యాంకుల్లోకే నింపుతారు.

ధరల విషయంలో కూడా సీఎన్‌జీ వాహనదారులకు పెద్ద ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి రోజూ మారుతుంటాయి. కానీ సీఎన్‌జీ ధరలు నిర్ణయించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఫార్ములాను వాడుతోంది. గ్యాస్ ధరలపై ఒక గరిష్ట పరిమితిని విధించడం వల్ల విదేశాల్లో రేట్లు పెరిగినా మన దగ్గర సీఎన్‌జీ బంకుల్లో ధరలు నిలకడగా ఉంటున్నాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు నెలవారీ ఖర్చులు అదుపులో ఉంటున్నాయి.

ముఖ్యంగా నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ అంతా సీఎన్‌జీ పైనే ఆధారపడి ఉంది. ఆర్టీసీ బస్సులు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు అన్నీ సీఎన్‌జీతోనే నడుస్తున్నాయి. ఒకవేళ వీటికి గ్యాస్ సరఫరా ఆగిపోతే నగరాలు స్తంభించిపోతాయి, నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి. అందుకే ప్రభుత్వం యుద్ధం వచ్చినా సరే సీఎన్‌జీని కాపాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్ కార్ల కంటే సీఎన్‌జీ కార్లు నడపడమే అత్యంత తెలివైన పని అని నిపుణులు చెబుతున్నారు. అందుకే 2026లో సీఎన్‌జీ కారు ఉన్నవాడు రోడ్డు మీద వీఐపీలా ఫీలవ్వడంలో తప్పులేదనిపిస్తోంది.

Tags:    

Similar News