Car Mileage Tips : పెట్రోల్ డబ్బులు ఆదా కావాలా? కారు మైలేజీ పెరగాలా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే
కారు మైలేజీ పెరగాలా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే
Car Mileage Tips : పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో కారు ఉన్న ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన సమస్య మైలేజీ. షోరూమ్ వాడు చెప్పిన మైలేజీ మనకు ఎందుకు రావడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. అయితే మైలేజీ అనేది కేవలం కారు మీద మాత్రమే కాదు, మనం డ్రైవ్ చేసే విధానం, మనం మెయింటైన్ చేసే స్పీడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. చాలా మంది మెల్లగా వెళ్తే మైలేజీ వస్తుందని, మరికొందరు వేగంగా వెళ్తే వస్తుందని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మైలేజీకి అసలైన స్వీట్ స్పాట్ ఏది?
సాధారణంగా పెట్రోల్, డీజిల్ కార్లకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగాన్ని గోల్డెన్ స్పీడ్ అని పిలుస్తారు. హైవేలపై కారు టాప్ గేర్‌లో ఈ వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్‌పై ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇంధనం చాలా తక్కువగా ఖర్చవుతుంది. మీరు 100 కి.మీ. వేగం దాటితే గాలి ఒత్తిడి పెరిగి, కారును ముందుకు నెట్టడానికి ఇంజన్ ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది, ఫలితంగా మైలేజీ ఘోరంగా పడిపోతుంది. ఇక సిటీ ట్రాఫిక్‌లో అయితే 40 నుంచి 50 కి.మీ. స్థిరమైన వేగం మెయింటైన్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మైలేజీని దెబ్బతీసే ప్రధాన తప్పులు
డ్రైవింగ్ చేసేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మన జేబుకు పెద్ద చిల్లు పెడతాయి.
* అకస్మాత్తుగా వేగం పెంచడం/తగ్గించడం: ట్రాఫిక్ సిగ్నల్ పడగానే సడన్ బ్రేక్ వేయడం లేదా గ్రీన్ పడగానే అమాంతం ఎక్సిలేటర్ తొక్కడం వల్ల ఇంధనం వృథా అవుతుంది.
* తప్పుడు గేర్ వాడకం: తక్కువ వేగంలో ఎక్కువ గేర్ లేదా ఎక్కువ వేగంలో తక్కువ గేర్ వాడటం వల్ల ఇంజన్ ఇంధనాన్ని గుటగుట తాగేస్తుంది.
* టైర్లలో గాలి తక్కువగా ఉండటం: టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుతో రాపిడి పెరిగి ఇంజన్‌కు కష్టమవుతుంది. ఇది నేరుగా మైలేజీపై ప్రభావం చూపుతుంది.
మైలేజీ పెంచే సూపర్ టిప్స్
మీ కారు మైలేజీని 20-30% వరకు పెంచుకోవడానికి ఈ మార్పులు చేయండి.
* క్రూయిజ్ కంట్రోల్: మీ కారులో క్రూయిజ్ కంట్రోల్ ఉంటే హైవేపై దాన్ని వాడండి. ఇది స్థిరమైన వేగాన్ని మెయింటైన్ చేసి ఇంధనాన్ని ఆదా చేస్తుంది.
* ఏసీ వాడకం: చాలా మంది ఏసీ వాడితే మైలేజీ తగ్గుతుందని అద్దాలు తీసి కారు నడుపుతారు. కానీ హైవేపై అద్దాలు తీసి డ్రైవ్ చేయడం వల్ల గాలి లోపలికి వచ్చి కారు వేగాన్ని అడ్డుకుంటుంది, దీనివల్ల ఏసీ కంటే ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుంది. కాబట్టి హైవేపై ఏసీ వేసి అద్దాలు మూసి ఉంచడమే మేలు.
* అనవసరమైన బరువు: కారు డిక్కీలో అవసరం లేని సామాన్లను తీసేయండి. కారు బరువు పెరిగే కొద్దీ మైలేజీ తగ్గుతుంది.