Honda Activa : యాక్టివా లవర్స్‌కు బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న ధరలు
భారీగా తగ్గనున్న ధరలు
Honda Activa : భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. ఇప్పుడు ఈ స్కూటర్ మరింత చవకగా మారింది. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ స్లాబ్ కారణంగా 350 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న టూ-వీలర్లపై నేరుగా లాభం లభించనుంది. గతంలో వీటిపై 28% జీఎస్టీ, 1% సెస్ విధించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దానిని 18కు తగ్గించింది. సెస్ ను పూర్తిగా తొలగించింది. అంటే, మొత్తం మీద ఇప్పుడు వినియోగదారులకు 10% వరకు పన్ను ఆదా అవుతుంది.
యాక్టివాపై భారీ తగ్గింపు
పన్ను కోత ప్రభావం హోండా యాక్టివాపై స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త పన్ను నిబంధనల వల్ల యాక్టివా 110పై రూ.7,874, యాక్టివా 125పై రూ.8,259 ఆదా అవుతుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హోండా యాక్టివా 125 డ్రమ్ వేరియంట్ ధర రూ.82,257గా ఉంది. అంతేకాకుండా, ఈ తగ్గింపుతో పాటు, పండుగ సీజన్‌లో డీలర్ డిస్కౌంట్లు, ఆఫర్ల ప్రయోజనం కూడా అదనంగా లభిస్తుంది. అంటే, యాక్టివా కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. కస్టమర్లకు ఇది డబుల్ బెనిఫిట్ లాంటిది.
యాక్టివా H-Smartను కంపెనీ స్మార్ట్-కీ టెక్నాలజీతో అందించింది. ఈ స్మార్ట్ కీ అడ్వాన్సుడ్ ఫీచర్లను అందిస్తుంది. దీని ద్వారా స్కూటర్‌కు 2 మీటర్ల దూరంలో వెళ్ళగానే అది ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. దగ్గరకు రాగానే అన్‌లాక్ అవుతుంది. పెట్రోల్ ట్యాంక్ మూత, సీటు తెరవడానికి ఇకపై కీని ఉపయోగించాల్సిన అవసరం లేదు, స్మార్ట్ కీతో సులభంగా ఈ పని చేయవచ్చు. అలాగే, పార్కింగ్ స్థలంలో స్కూటర్‌ను సులభంగా కనుగొనడానికి కూడా ఈ కీ సహాయపడుతుంది. ఇందులో యాంటీ-థెఫ్ట్ ఫంక్షన్ కూడా ఉంది, ఇది సేఫ్టీని మరింత పెంచుతుంది.
డిజైన్ పరంగా యాక్టివాలో పెద్దగా మార్పులు లేవు. ఇందులో కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, హోండా ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటి మాదిరిగానే BS6 109.51సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఒక టెస్ట్ ప్రకారం.. ఈ స్కూటర్ ఒక లీటర్ పెట్రోల్‌లో 52 కి.మీ మైలేజ్ ఇస్తుంది.