Car Prices : కారు కొనేవారికి శుభవార్త.. రూ.10 లక్షల వరకు తగ్గిన కార్ల ధరలు
రూ.10 లక్షల వరకు తగ్గిన కార్ల ధరలు
Car Prices : పండుగల సీజన్ రాకముందే కారు కొనాలనుకుంటున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం కార్లపై జీఎస్టీని తగ్గించడంతో అనేక కంపెనీలు తమ కార్ల ధరలను భారీగా తగ్గించనున్నాయి. ముఖ్యంగా చిన్న కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు ధరలు గణనీయంగా తగ్గుతాయి. జీఎస్టీ ప్రభావం వల్ల ఏయే కార్ల ధరలు ఎంత తగ్గనున్నాయి? ఈ కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలవుతాయి? వంటి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం కార్లపై జీఎస్టీని తగ్గించడంతో కారు కంపెనీలు ధరలను తగ్గించడం ప్రారంభించాయి. ఆటోమొబైల్ రంగ నిపుణుల ప్రకారం.. మారుతి సుజుకి ఆల్టో వంటి చిన్న కార్ల నుంచి మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ వంటి లగ్జరీ కార్ల వరకు ధరలు రూ.45,000 నుంచి రూ.10 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో చిన్న కార్ల ధరలు రూ.45,000 నుంచి రూ.లక్ష వరకు తగ్గే అవకాశం ఉంది.
ఏ కార్లపై ఎంత తగ్గుతుందంటే..
మారుతి సుజుకి ఆల్టో లాంటి చిన్న కార్ల షోరూమ్ ధర ప్రస్తుతం రూ.4.23 లక్షలు ఉంది. జీఎస్టీ తగ్గింపుతో ఈ ధర మరింత తగ్గనుంది. అదేవిధంగా, లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ కూడా తన A-క్లాస్ నుంచి S-క్లాస్ వరకు కార్ల ధరలను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తగ్గించే అవకాశం ఉంది.
ఎంత పన్ను తగ్గిందంటే..
గత వారం జీఎస్టీ కౌన్సిల్ కార్ల జీఎస్టీ రేట్లలో పెద్ద మార్పు చేసింది. ఇంతకుముందు ఉన్న 28%, 12% స్లాబ్‌లను రద్దు చేసి, 5%, 18% స్లాబ్‌లకు పరిమితం చేసింది. చిన్న కార్లను 18% స్లాబ్‌లో చేర్చారు. గతంలో వీటిపై 28% జీఎస్టీ, 1% సెస్ ఉండేది. ఈ విధంగా చిన్న కార్ల మీద మొత్తం 11% పన్ను తగ్గుతుంది. ఈ కొత్త ధరలు నవరాత్రి మొదటి రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. SUV, లగ్జరీ కార్లపై 40% జీఎస్టీ విధించారు. గతంలో వీటిపై సెస్ తో కలిపి 40% నుంచి 50% వరకు పన్ను ఉండేది.
ప్రకటన చేసిన కంపెనీలు
ఆడి ఇండియా ఒక ప్రకటనలో సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత తమ కార్ల ధరలు నాలుగు నుంచి ఆరు శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అయితే, తుది ధరలు త్వరలోనే ప్రకటిస్తామని ఆడి పేర్కొంది. అలాగే, బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియాకు చెందిన ఎక్స్1 నుంచి ఎక్స్7 వరకు కార్ల ధరలు రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్,రెనాల్ట్ ఇండియా వంటి అనేక కంపెనీలు ఇప్పటికే ధరల తగ్గింపును ప్రకటించాయి.