Harley Davidson X440 T: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సవాల్... హీరో-హార్లీ జంటగా కొత్త X440 T బైక్‌లు లాంచ్

హీరో-హార్లీ జంటగా కొత్త X440 T బైక్‌లు లాంచ్

Update: 2025-12-08 06:21 GMT

Harley Davidson X440 T: భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, అమెరికన్ ఐకాన్ హార్లీ-డేవిడ్‌సన్ మధ్య భాగస్వామ్యం మరింత బలపడింది. ఈ రెండు కంపెనీలు కలిసి తమ ప్రీమియం మోటార్‌సైకిల్ శ్రేణిని విస్తరిస్తూ కొత్త ఫీచర్లతో కూడిన H-D X440 T మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేశాయి. దీనితో పాటు, రెండు పవర్పుల్ టాప్-లెవల్ CVO (Custom Vehicle Operations) మోటార్‌సైకిళ్లను కూడా పరిచయం చేశాయి. ఈ విస్తరణ దేశీయ ప్రీమియం బైక్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా ఉంది. తద్వారా ఎక్కువ మంది వినియోగదారులను హార్లీ-డేవిడ్‌సన్ ప్రపంచంలోకి ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కొత్త X440 T మోడల్ 2023 జూలైలో వచ్చిన పాత X440 మోడల్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందించబడింది. ఈ కొత్త మోడల్‌లో అడ్వాన్సుడ్ టెక్నాలజీ, రైడర్-సెంట్రలైజ్డ్ ఫీచర్లను జోడించారు. ఇందులో ముఖ్యంగా రైడ్-బై-వైర్ టెక్నాలజీ, ఆన్/ఆఫ్ చేయగలిగే ట్రాక్షన్ కంట్రోల్, వెనుక చక్రానికి స్విచ్‌తో కూడిన ఏబీఎస్ (ABS) ఉన్నాయి. ఈ బైక్ రోడ్, రెయిన్ అనే రెండు రైడింగ్ మోడ్స్‌తో వస్తుంది. డిజైన్ పరంగా వెనుక ప్రయాణీకుడి సౌకర్యం కోసం కొత్త సబ్-ఫ్రేమ్‌ను అమర్చారు. అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే, ఇందులో పానిక్ బ్రేకింగ్ అలర్ట్ సిస్టమ్ ఉంది. ఒకవేళ బ్రేక్‌లు వేగంగా వేస్తే, వెనుక వాహనాలను అప్రమత్తం చేయడానికి అన్ని ఇండికేటర్లు వేగంగా మెరుస్తాయి.

కొత్త తరానికి చెందిన రైడర్‌ల కోసం X440 T ని టెక్నాలజీ, స్పోర్టీ లుక్‌తో తీసుకురావడం పెద్ద ముందడుగుగా కంపెనీ పేర్కొంది. కొత్త మోడల్ విడుదల సందర్భంగా కంపెనీ పాత X440 మోడళ్ల ధరలను కూడా సవరించింది. కొత్త X440 T ధర రూ.2,79,500 (ఎక్స్-షోరూమ్) కాగా, అత్యంత ఖరీదైన X440 S వేరియంట్ ధరను తగ్గించి రూ.2,54,900కి, X440 Vivid వేరియంట్ ధరను రూ.2,34,500కి మార్చారు. ఈ ధరల తగ్గింపు వలన మరింత మంది వినియోగదారులు హార్లీ బైకులను కొనుగోలు చేయడానికి ఆకర్షితులవుతారని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలోకి కంపెనీ రెండు పవర్‌ఫుల్ CVO మోడళ్లను కూడా ప్రవేశపెట్టింది. ఒకటి CVO రోడ్ గ్లైడ్ . ఇది ప్రత్యేకమైన షార్క్-నోస్ ఫ్రంట్ డిజైన్, పవర్ఫుల్ 121 ఇంజిన్ (115 hp పవర్, 189 Nm టార్క్), 12.3-అంగుళాల పెద్ద స్క్రీన్ కలిగిన స్కైలైన్ OS ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.67,36,720గా ఉంది. రెండవది CVO స్ట్రీట్ గ్లైడ్. ఈ బైక్‌లో కొత్త బ్యాట్‌వింగ్ ఫెయిరింగ్ ఉంది. ఇందులో కూడా అదే శక్తివంతమైన 121 ఇంజిన్‌ను అమర్చారు. దీని ధర రూ.63,03,142. ఈ రెండు CVO బైక్‌లు ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్, ప్రత్యేకమైన పెయింట్, హై-క్వాలిటీ ఫినిషింగ్‌లతో అత్యంత విలాసవంతమైన మోడళ్లుగా నిలుస్తున్నాయి.

Tags:    

Similar News