Trending News

Bike Sales : మైలేజీలో తోపు..ధరలో ఛాంపియన్..మళ్ళీ నంబర్-1గా హీరో స్ప్లెండర్

మళ్ళీ నంబర్-1గా హీరో స్ప్లెండర్

Update: 2026-01-26 11:56 GMT

Bike Sales : భారత టూ-వీలర్ మార్కెట్‌లో రారాజు ఎవరంటే కళ్లు మూసుకుని చెప్పే పేరు హీరో స్ప్లెండర్. 2025 డిసెంబర్ నెల విక్రయాల గణాంకాలు చూస్తుంటే ఈ బైక్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. కేవలం రూ.74,152 ప్రారంభ ధర, 60 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇచ్చే ఈ బైక్, గత నెలలో మళ్ళీ నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా టాప్-10 బైక్‌ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 41.8 శాతం పెరగడం విశేషం.

2025 డిసెంబర్ నెల భారత మోటార్ సైకిల్ రంగానికి ఒక అద్భుతమైన ముగింపును ఇచ్చింది. టాప్-10 బైక్‌ల జాబితాలో హీరో స్ప్లెండర్ 2,80,760 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. పల్లెటూళ్ల నుంచి పట్టణాల వరకు ఉన్న సామాన్యులకు ఈ బైక్ ఒక నమ్మకమైన నేస్తంలా మారింది. గతేడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 45.9 శాతం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం తక్కువ మెయింటెనెన్స్ మరియు అత్యుత్తమ మైలేజీ.

రెండో స్థానంలో హోండా షైన్ నిలిచింది. 125cc విభాగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఈ బైక్, గత నెలలో 1,41,602 యూనిట్లు అమ్ముడైంది. ఇక పర్ఫార్మెన్స్ బైక్‌ల విషయానికి వస్తే, టీవీఎస్ అపాచీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బైక్‌గా గుర్తింపు పొందింది. ఏకంగా 117.9 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తూ యువతలో తనకున్న క్రేజ్‌ను చాటుకుంది. అపాచీతో పాటు టీవీఎస్ రైడర్ కూడా 125cc విభాగంలో తన ఉనికిని చాటుకుంది.

ప్రీమియం, క్లాసిక్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యం కొనసాగుతోంది. క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350 బైక్‌లు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ 350 ఏకంగా 76.9 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. మరోవైపు బజాజ్ పల్సర్ తన స్థానాన్ని స్థిరంగా నిలబెట్టుకుంది. పల్లెల్లో పెరిగిన డిమాండ్, పండుగ సీజన్ ఆఫర్లు, కంపెనీలు అందిస్తున్న ఈజీ ఈఎంఐ ఆప్షన్ల వల్ల ఈ స్థాయిలో విక్రయాలు పెరిగాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News