Honda: ఆరు నెలల్లో ఏకంగా 34 లక్షల వెహికల్స్.. హోండా సంచలన రికార్డు
సంచలన రికార్డు
Honda: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) సేల్స్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) మొదటి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కంపెనీ ఏకంగా 34,40,072 టూ వీలర్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదలను సూచిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో హోండా వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఎగుమతులు ఏకంగా 27 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.
సెప్టెంబర్ నెలలో 24 శాతం భారీ వృద్ధి
సెప్టెంబర్ 2026 నెల సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే హోండా మొత్తం 7,06,266 టూ వీలర్లను విక్రయించింది. ఇందులో భారతీయ మార్కెట్లోనే 6,36,768 యూనిట్లు అమ్ముడవగా, 69,498 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. సెప్టెంబర్ 2025లో నమోదైన 5,68,164 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే ఈసారి ఏకంగా 24 శాతం మేర వార్షిక వృద్ధి నమోదైంది. కస్టమర్ల నుంచి వస్తున్న విశేష ఆదరణే ఈ భారీ విక్రయాలకు ప్రధాన కారణం.
విదేశాలకు 3.96 లక్షల వాహనాలు
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశీయంగా 30,44,072 యూనిట్లు విక్రయించిన హోండా, విదేశీ మార్కెట్లకు 3,96,000 యూనిట్లను సరఫరా చేసింది. గత ఏడాది గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, రేట్ల మార్పు అంచనాల వల్ల విక్రయాలు కాస్త నెమ్మదించినప్పటికీ, ఈసారి ఎగుమతుల్లో 27 శాతం వృద్ధి సాధించడం కంపెనీ పట్టును నిరూపిస్తోంది. రాబోయే పండుగల సీజన్‌లో ఈ అమ్మకాలు మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చే ప్లాన్
భారత్‌ను ప్రధాన తయారీ కేంద్రంగా, ఎగుమతుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు హోండా భారీ వ్యూహాలు రచిస్తోంది. 2028 నాటికి ప్రతి సంవత్సరం 80 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రొడక్షన్ కెపాసిటీని వేగంగా పెంచుతోంది. ఈ ఏడాది జూలై నెలలో నిర్వహించిన మెగా ఈవెంట్‌లో ఏకంగా 10 కొత్త, అప్‌డేటెడ్ మోడళ్లను ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్‌లు, స్కూటర్ల విక్రయాలు రాబోయే రోజుల్లో సేల్స్ నంబర్లను మరింత పెంచనున్నాయి.