Car Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం మేర పెంచి 5.50 శాతానికి చేర్చింది. కేంద్ర బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై కార్ లోన్ తీసుకున్న వారి జేబులపై ప్రభావం పడే అవకాశం ఉంది. బ్యాంకులు ఈ వడ్డీ పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తే, వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి నెలవారీ ఈఎంఐ భారం కానుంది.

రూ.10 లక్షల రుణంపై ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే?

ఉదాహరణకు 9 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్ల (60 నెలల) వ్యవధికి రూ.10 లక్షల కార్ లోన్ తీసుకుంటే, ప్రస్తుతం నెలవారీ ఈఎంఐ దాదాపు రూ.20,758గా ఉంటుంది. బ్యాంకులు వడ్డీ రేటును 9.25 శాతానికి పెంచినట్లయితే, ఈఎంఐ రూ.20,875కి పెరుగుతుంది. దీనివల్ల ప్రతి నెల అదనంగా రూ.117 భారం పడుతుంది. సంవత్సరానికి చూస్తే సుమారు రూ.1,404 వరకు అదనంగా చెల్లించాల్సి రావచ్చు. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే కాగా, బ్యాంక్ షరతులను బట్టి మారే అవకాశం ఉంటుంది.

ఫ్లోటింగ్ vs ఫిక్స్‌డ్ లోన్లు

ఫ్లోటింగ్ రేటుపై లోన్ తీసుకున్న వారిపై ఈ వడ్డీ పెంపు ప్రభావం నేరుగా, త్వరగా కనిపిస్తుంది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమైన రుణాలకు వడ్డీ రేట్లు వెంటనే మారతాయి. అదే సమయంలో, ఫిక్స్‌డ్ వడ్డీ రేటుపై లోన్ తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి వడ్డీ రేటు ముందుగానే నిర్ణయించబడటం వల్ల ఆర్‌బీఐ నిర్ణయంతో సంబంధం లేకుండా ఈఎంఐ స్థిరంగా ఉంటుంది.

కొత్తగా కార్ లోన్ తీసుకునే వారు పాటించాల్సిన సూత్రాలు

కొత్తగా కారు కొనాలని భావించే వారు రుణం తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. ముందుగా మంచి క్రెడిట్ స్కోరు ఉందో లేదో చూసుకోవాలి, క్రెడిట్ స్కోరు బాగుంటే తక్కువ వడ్డీకే లోన్ లభించే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ఈఎంఐ ఆప్షన్లను పోల్చి చూసుకోవడం మంచిది. ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు ఛార్జీల వివరాలను ముందుగానే తెలుసుకోవాలి.

బడ్జెట్‌కు తగ్గట్లు ఈఎంఐ ప్లాన్ చేసుకోండి

కార్ లోన్ తీసుకునే సమయంలో ప్రయోజనాలను పూర్తిగా పరిశీలించాలి. ఉద్యోగులకు కంపెనీల ద్వారా బ్యాంక్ ఆఫర్లు ఉంటే వాటిని వినియోగించుకోవచ్చు. ఆదాయం, ఇతర నెలవారీ ఖర్చులను లెక్కలేసుకొని, ప్రతి నెల సులభంగా చెల్లించగలిగే పరిమితిలోనే ఈఎంఐ ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం.

Tags: