Honda Elevate: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.11.80 లక్షలుగా నిర్ణయించారు. 2023లో లాంచ్ అయిన తర్వాత ఎలివేట్ మోడల్‌కు లభించిన మొదటి పెద్ద అప్‌డేట్ ఇది. ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ అనేక మార్పులు చేసి, లేటెస్ట్ ఫీచర్లను జోడించి సరికొత్త లుక్‌తో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు.

అదిరిపోయే ఎక్స్‌టీరియర్ డిజైన్

డిజైన్ పరంగా కొత్త ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో బోల్డ్ మెష్ గ్రిల్, గ్లాస్-బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. ముందు వైపు H లోగో స్థానాన్ని మార్చడంతో పాటు త్రీ-బార్ సిగ్నేచర్‌తో కూడిన ఎల్‌ఈడీ పొజిషన్ లైట్లను అమర్చారు. వెనుక వైపు ఫుల్-విడ్త్ కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్-లాంప్స్ అందించడం వల్ల వాహనం మరింత వెడల్పుగా, అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. వాహనం కొలతల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పొడవు 4,312 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 220 మిమీగా ఉంది.

సెగ్మెంట్లోనే ఫస్ట్ టైమ్

కేబిన్ లోపల ఐవరీ-బ్లాక్ డ్యూయల్-టోన్ థీమ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, ప్రీమియం లెదర్ సీట్లు ఇచ్చారు. ముందు, వెనుక సీట్లలో వెంటిలేషన్ సదుపాయం కల్పించారు. వెనుక సీట్లలో వెంటిలేషన్ ఫీచర్ ఇవ్వడం ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారి కావడం విశేషం. దీనితో పాటు 360-డిగ్రీ సరౌండింగ్ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, వన్-టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25-ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-స్పికర్ల సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు. PM2.5 ఎయిర్ క్వాలిటీ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది.

పవర్‌ఫుల్ ఇంజిన్

ఇంజిన్ విభాగంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటి 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగించారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్‌లో SV, V, VX, ZX, ZX+ వేరియంట్లు ఉండగా, ఆటోమేటిక్‌లో V, VX, ZX, ZX+ వేరియంట్లు లభిస్తాయి. హోండా ఈ కారుపై 3 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీని అందిస్తోంది. దీనిని గరిష్టంగా 10 ఏళ్లు లేదా 1,20,000 కిలోమీటర్ల వరకు పొడిగించుకునే అవకాశం కల్పించారు.

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్తోస్‌లకు గట్టి సవాల్

భారత మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్తోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి పాపులర్ ఎస్‌యూవీలకు పోటీగా హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ నిలవనుంది. అధునాతన సేఫ్టీ ఫీచర్లు, అట్రాక్టివ్ డిజైన్, మెరుగైన ఇంటీరియర్‌తో వచ్చిన ఈ మోడల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కొత్త సంచలనం సృష్టిస్తుందని హోండా భావిస్తోంది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Tags: