Trending News

Honda Activa : స్కూటర్ల మార్కెట్లో యాక్టివాదే హవా..డిసెంబర్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు

డిసెంబర్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు

Update: 2026-01-26 11:54 GMT

Honda Activa : భారతదేశంలో స్కూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హోండా యాక్టివా. 2025 డిసెంబర్‎లో 1,81,604 యూనిట్ల విక్రయాలతో యాక్టివా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గతేడదితో పోలిస్తే దీని అమ్మకాలు 50 శాతం పెరిగాయి. రెండో స్థానంలో టీవీఎస్ జుపిటర్ 1,20,477 యూనిట్లతో తన పట్టును నిరూపించుకుంది. కుటుంబ అవసరాల కోసం స్కూటర్ కొనేవారు ఎక్కువగా ఈ రెండు మోడళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రీమియం 125cc విభాగంలో సుజుకి యాక్సెస్ 125 తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మూడో స్థానంలో నిలిచింది.

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్ 35,177 యూనిట్ల అమ్మకాలతో ఎలక్ట్రిక్ స్కూటర్ల కింగ్ గా అవతరించింది. దీని విక్రయాలు గతేడాది కంటే 75.9 శాతం పెరగడం విశేషం. మరోవైపు, ఫ్యామిలీ-ఫొకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పేరు తెచ్చుకున్న ఏథర్ రిజ్టా ఏకంగా 91.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. బజాజ్ చేతక్ అమ్మకాలు స్వల్పంగా తగ్గినా, స్థిరమైన ప్రదర్శనతో టాప్-10లో కొనసాగుతోంది. యువతను ఆకట్టుకోవడంలో టీవీఎస్ ఎన్-టార్క్,హోండా డియో ముందంజలో ఉన్నాయి.

ఈ ఏడాది టాప్-10 జాబితాలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన స్కూటర్ గా హీరో డెస్టినీ 125 నిలిచింది. దీని అమ్మకాలు దాదాపు రెండు రెట్లు (1.86 రెట్లు) పెరగడం ఆటోమొబైల్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. హోండా, టీవీఎస్, సుజుకి కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడంలో సఫలమయ్యాయి. పెట్రోల్ ధరల పెరుగుదల, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వల్ల కస్టమర్లు క్రమంగా ఈవీల వైపు మళ్లుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి 2026 ప్రారంభంలో స్కూటర్ మార్కెట్ సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతోంది.

Tags:    

Similar News