Hyundai : హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్ల జాతర..ఎక్స్‌టర్, i20 లపై భారీ తగ్గింపు
ఎక్స్‌టర్, i20 లపై భారీ తగ్గింపు
Hyundai : కొత్త సంవత్సరం 2026 ప్రారంభంలో కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ ఇండియా అదిరిపోయే బహుమతిని ప్రకటించింది. తమ పాపులర్ కార్లపై భారీ స్థాయిలో డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. మీరు ఎంచుకునే మోడల్, వేరియంట్ , మీ నగరంలోని డీలర్ వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ఈ తగ్గింపులు మారుతుంటాయి. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్‌టర్, i20 వంటి మోడళ్లపై లక్ష రూపాయలకు చేరువలో ఆఫర్లు ఉండటం గమనార్హం.
హ్యుందాయ్ కంపెనీ తమ మోస్ట్ పాపులర్ మైక్రో ఎస్‍యూవీ హ్యుందాయ్ ఎక్స్‌టర్ పై ఏకంగా రూ.98,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో ఎక్స్‌టర్ SX వేరియంట్‌పై గరిష్టంగా ఆఫర్లు ఉండగా, SX(O) వేరియంట్‌పై రూ.90,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సిటీలో తిరగడానికి ఎకనామికల్ గా ఉండే ఎక్స్‌టర్ సిఎన్‌జి (CNG) మోడల్ తీసుకోవాలనుకుంటే, దానిపై రూ.63,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. చిన్న కారు అయినా సరే ఎస్‍యూవీ ఫీలింగ్ ఇచ్చే ఎక్స్‌టర్ కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది.
హ్యుందాయ్ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ i20 పై ఈ జనవరిలో రూ.95,000 వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. స్పోర్టీ లుక్ ఇష్టపడే వారి కోసం రూపొందించిన i20 N లైన్ మోడల్‌పై కూడా రూ.87,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మారుతి బలేనో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లకు పోటీగా ఉండే i20 ని ఈ ధరలో సొంతం చేసుకోవడం మంచి డీల్ అని చెప్పవచ్చు. అలాగే బడ్జెట్ కారు గ్రాండ్ i10 నియోస్ పెట్రోల్ మాన్యువల్ వెర్షన్‌పై రూ.89,000 వరకు, సిఎన్‌జి వెర్షన్‌పై రూ.80,000 వరకు తగ్గింపు ఉంది.
హ్యుందాయ్ స్టైలిష్ సెడాన్ వెర్నా పై టర్బో, నాచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియంట్లు రెండింటిపై రూ.70,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. కాంపాక్ట్ సెడాన్ ఆరా పై రూ.58,000 వరకు తగ్గింపు ఉంది, ఇందులో సిఎన్‌జి మోడల్ కొంటే ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు. ఇక ఎస్‍యూవీ సెగ్మెంట్ విషయానికి వస్తే.. హ్యుందాయ్ అల్కాజర్ పై రూ.65,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. అత్యధికంగా అమ్ముడయ్యే క్రెటా పై మాత్రం కాస్త తక్కువగా అంటే రూ.40,000 వరకు మాత్రమే తగ్గింపు లభిస్తోంది. పాత స్టాక్ వెన్యూ కొంటే రూ.60,000 వరకు ఆదా అవుతుంది, అదే కొత్త మోడల్ వెన్యూపై రూ.25,000 వరకు డిస్కౌంట్ ఉంది.