Hyundai Verna SX+: హ్యుందాయ్ వెర్నాలో కొత్త మెరుపు..ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే ధర!
ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే ధర!;
Hyundai Verna SX+: హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో తమ అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ వెర్నాలో సరికొత్త 'SX+' వేరియంట్‌ను విడుదల చేసింది. స్టైల్, లేటెస్ట్ ఫీచర్లు, పర్‌ఫార్మెన్స్‌ల కలయికగా ఈ కొత్త మోడల్ రూపొందింది. వెర్నా SX, SX(O) వేరియంట్‌ల మధ్య ఒక బెస్ట్ ఆప్షన్ గా ఇది వినియోగదారులను ఆకట్టుకుంటుంది. వాహన ప్రియుల అభిరుచికి తగ్గట్టుగా అనేక మార్పులు, చేర్పులతో వచ్చిన ఈ కొత్త వెర్నా SX+ గురించి పూర్తి వివరాలను ఈ వార్తలో చూద్దాం.
2025 హ్యుందాయ్ వెర్నా SX+ వినియోగదారులకు చాలా సౌలభ్యాన్ని అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ వెర్షన్ ధర రూ.13.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఆటోమేటిక్ IVT వెర్షన్ ధర రూ.15.04 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది వెర్నా SX మోడల్ కంటే పైన మోడల్. కానీ టాప్-ఎండ్ SX(O) వేరియంట్ అంత ఖరీదైనది కాదు. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను ఆశించే వారికి ఈ SX+ మోడల్ సరైన ఎంపిక అని చెప్పొచ్చు.
హ్యుందాయ్ ఈ SX+ వేరియంట్‌లో అనేక ప్రీమియం ఫీచర్లను జోడించింది. గతంలో ఇవి కేవలం టాప్ వేరియంట్‌లలో మాత్రమే లభ్యమయ్యేవి. ఇందులో LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి రాత్రిపూట స్పష్టమైన దృష్టితో పాటు కారుకు స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. అలాగే, ముందు భాగంలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ , 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ స్పోర్టీ లుక్ అందిస్తాయి. వెనుక భాగంలో రియర్ స్పాయిలర్ కారుకు ఏరోడైనమిక్ స్టైల్‌ను జోడిస్తుంది.
కారు లోపలి భాగంలో, బోస్ 8-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ అద్భుతమైన సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, వేసవిలో సీట్లను చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచే హీటెడ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ లగ్జరీ ఫీలింగ్‌ను ఇస్తాయి. లెదరైట్ సీట్స్ క్యాబిన్‌కు ప్రీమియం టచ్‌ను అందిస్తాయి. భద్రత విషయానికి వస్తే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ESC, TPMS, రియర్ కెమెరా (Rear Camera) వంటి లేటెస్ట్ ఫీచర్లు ప్రయాణికులకు సేఫ్టీని అందిస్తాయి.
ఈ కొత్త వెర్నా SX+ వేరియంట్‌లో హ్యుందాయ్ 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఈ ఇంజిన్ 113bhp పవర్, 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా IVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ దాని స్మూత్ ఆపరేషన్, రిఫైన్‌మెంట్, మంచి మైలేజీకి ప్రసిద్ధి చెందింది. ఇది నగరంలో, హైవేలపై అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
హ్యుందాయ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కోసం ఒక వైర్‌లెస్ అడాప్టర్‌ను కూడా పరిచయం చేసింది. దీని ధర రూ.4,500. ఇది SX(O), SX Turbo, SX(O) Turbo వేరియంట్‌లతో పనిచేస్తుంది. ఈ అడాప్టర్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.