Motorcycle Exports : ఎగుమతుల్లో నయా రికార్డ్..43 లక్షల బైక్‌లతో ప్రపంచాన్ని చుట్టేస్తున్న భారత్
43 లక్షల బైక్‌లతో ప్రపంచాన్ని చుట్టేస్తున్న భారత్
Motorcycle Exports : భారతదేశం కేవలం స్మార్ట్‌ఫోన్లకే కాదు.. మోటార్ సైకిళ్ల తయారీలోనూ ప్రపంచానికి హబ్‌గా మారిపోతోంది. మన దేశీ బైక్‌లంటే విదేశీయులు పడిచచ్చిపోతున్నారు. దీనికి నిదర్శనమే 2025లో నమోదైన అద్భుతమైన ఎగుమతుల గణాంకాలు. గతేడాదితో పోలిస్తే బైక్‌ల ఎగుమతులు ఏకంగా 27 శాతం వృద్ధి చెందాయి. 2025లో మొత్తం 43 లక్షల మేడ్ ఇన్ ఇండియా బైక్‌లు సముద్రం దాటి విదేశీ రోడ్లపై పరుగులు తీశాయి. ఇది కరోనా తర్వాత నమోదైన అతిపెద్ద రికార్డు కావడం విశేషం.
ఒకప్పుడు మనం విదేశీ బైక్‌ల కోసం ఆశగా చూసేవాళ్లం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 2017లో కేవలం 23 లక్షలుగా ఉన్న ఎగుమతులు, 2025 నాటికి దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. కరోనా సమయంలో వ్యాపారం కాస్త నెమ్మదించినా, ఆ తర్వాత భారత ఆటోమొబైల్ కంపెనీలు పుంజుకున్న తీరు అమోఘం. ముఖ్యంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో భారతీయ బైక్‌లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇవ్వడం, గరుకు రోడ్లపై కూడా సునాయాసంగా దూసుకెళ్లడం మన బైక్‌ల ప్రత్యేకత.
విదేశీ ఎగుమతుల్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలు సింహభాగం వహిస్తున్నాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ రెండు కంపెనీల వాటానే 72 శాతంగా ఉంది. బజాజ్ ఆటో తన ఎగుమతులను 16 లక్షల నుంచి 19 లక్షలకు పెంచుకోగా, టీవీఎస్ మోటార్ 9 లక్షల నుంచి 13 లక్షల మార్కును చేరుకుంది. ముఖ్యంగా కొలంబియా, బ్రెజిల్, నైజీరియా, నేపాల్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో భారతీయ బైక్‌లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.
కేవలం కమ్యూటర్ బైక్‌లే కాకుండా, ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ప్రీమియం బైక్‌ల ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఈ స్థాయి వృద్ధి వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారకద్రవ్యం భారీగా సమకూరుతోంది. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా పథకం కూడా ఈ విజయానికి ప్రధాన కారణం. ఇదే వేగం కొనసాగితే, రాబోయే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు బైక్‌లలో ఒకటి భారత తయారీదే అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.