Maruti Ertiga CNG : పెట్రోల్ తిప్పలు లేవు..మైలేజీలో తిరుగులేదు..సీఎన్‌జీ కార్ల మార్కెట్లో ఎర్టిగాదే హవా
సీఎన్‌జీ కార్ల మార్కెట్లో ఎర్టిగాదే హవా
Maruti Ertiga CNG : మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ముఖ్యంగా మన దేశంలో ఫ్యామిలీ కారు కొనేటప్పుడు ఎక్కువ సీట్లు ఉండాలి, ఖర్చు తక్కువవ్వాలి, పైగా ఆ బ్రాండ్ మీద నమ్మకం ఉండాలి. ఈ మూడు సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ మారుతి సుజుకి ఎర్టిగా CNG 2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే నంబర్-1 7-సీటర్ సీఎన్‌జీ కారుగా రికార్డు సృష్టించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్ మార్కెట్ ఒక ఆసక్తికరమైన మార్పును చూసింది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో కస్టమర్లు సీఎన్‌జీ కార్ల వైపు క్యూ కట్టారు. మొత్తం అమ్ముడైన కార్లలో దాదాపు 18.5 శాతం సీఎన్‌జీ మోడళ్లే ఉండటం విశేషం. ఈ క్రేజీ ట్రెండ్‌ను మారుతి సుజుకి ఎర్టిగా పూర్తిగా వాడుకుంది. గతేడాది ఏకంగా 1,29,920 యూనిట్ల ఎర్టిగా సీఎన్‌జీ కార్లు అమ్ముడయ్యాయి. అంటే దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన సీఎన్‌జీ కారుగా ఇది నిలిచింది. ఈ కారుకు 7-సీటర్ విభాగంలో కనీసం పోటీ ఇచ్చే మోడల్ కూడా మార్కెట్లో కనిపించలేదు.
అసలు ఎర్టిగా సీఎన్‌జీకి ఎందుకంత డిమాండ్ అంటే.. దానిలోని స్పేస్. సాధారణంగా చాలా ఎంపీవీ కార్లలో మూడో వరుస సీట్లలో కూర్చోవడం కష్టంగా ఉంటుంది. కానీ ఎర్టిగాలో చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇక మైలేజీ విషయానికొస్తే, సీఎన్‌జీ ఇంజిన్ కావడంతో రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికైనా, వారాంతాల్లో ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్స్ వేసే వారికైనా ఇది జేబుకు చిల్లు పడకుండా చూసుకుంటుంది. అందుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఈ కారును కళ్ళు మూసుకుని కొనేస్తున్నారు.
మరో ప్రధాన కారణం మారుతి సుజుకి బ్రాండ్ మీద ఉన్న నమ్మకం. ఊరి చివర చిన్న మెకానిక్ షాపులో కూడా మారుతి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. పైగా ఈ కారును మళ్ళీ అమ్మాలనుకున్నప్పుడు మంచి రీసేల్ వాల్యూ వస్తుంది. కేవలం సొంత అవసరాలకే కాదు, టాక్సీ ఆపరేటర్లకు కూడా ఎర్టిగా సీఎన్‌జీ ఒక కామధేనువు లాంటిది. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజీ ఇవ్వడం వల్ల బిజినెస్ పరంగా కూడా ఇది బెస్ట్ ఛాయిస్. మారుతి ఎర్టిగా కేవలం ఒక కారు మాత్రమే కాదు, లక్షలాది భారతీయ కుటుంబాల ఆర్థిక పొదుపు మంత్రం అని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.