Car Sales: భారతీయ కార్ల మార్కెట్‌కు అక్టోబర్ 2026 నెల అత్యంత చిరస్మరణీయంగా నిలిచిపోయింది. పండుగల సీజన్ డిమాండ్, కంపెనీలు అందించిన డిస్కౌంట్లు, జీఎస్టీ 2.0 తెచ్చిన సానుకూల మార్పులతో కార్ల విక్రయాలు ఆకాశాన్ని తాకాయి. చరిత్రలోనే తొలిసారిగా ఒకే నెలలో ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 5 లక్షల యూనిట్ల మైలురాయిని దాటేశాయి. మారుతి సుజుకి ఎప్పటిలాగే భారీ విక్రయాలతో నంబర్ వన్ స్థానంలో నిలవగా, టాటా మోటార్స్ సంచలన రీతిలో మహీంద్రాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

అగ్రస్థానంలో తిరుగులేని మారుతి సుజుకి

కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. అక్టోబర్ నెలలో దేశీయ మార్కెట్లో ఏకంగా 2,16,789 వాహనాలను విక్రయించింది. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 1,80,675 యూనిట్లతో పోలిస్తే ఇది 20 శాతం భారీ వృద్ధిని సూచిస్తోంది. చిన్న కార్ల నుంచి ఎస్‌యూవీలు, ఎమ్‌పివిలు, సెడాన్ల వరకు అన్ని విభాగాల్లోనూ మంచి ఆదరణ లభించింది. కంపెనీ వద్ద ప్రస్తుతం 2.45 లక్షల కార్ల బుకింగ్స్ పెండింగ్‌లో ఉండగా, డీలర్ల వద్ద కేవలం 12 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉండటం మార్కెట్లో ఉన్న విపరీతమైన డిమాండ్‌కు అద్దం పడుతోంది.

టాటా, మహీంద్రా మధ్య హోరాహోరీ పోరు

రెండో స్థానం కోసం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. చివరకు టాటా మోటార్స్ కేవలం 556 కార్ల తేడాతో మహీంద్రాను వెనక్కి నెట్టి రన్నరప్‌గా నిలిచింది. అక్టోబర్‌లో టాటా మోటార్స్ 20.9 శాతం వృద్ధితో 73,894 ప్యాసింజర్ వాహనాలను విక్రయించగా, మహీంద్రా 73,338 వాహనాలను అమ్మగలిగింది. మహీంద్రా అమ్మకాలు గతేడాయితో పోలిస్తే 2.4 శాతం పెరిగినప్పటికీ, టాటా మోటార్స్ చూపిన వేగవంతమైన వృద్ధి ముందు తలవంచక తప్పలేదు.

హ్యుందాయ్ వెన్యూ సరికొత్త రికార్డు

హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా అక్టోబర్ నెలలో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. గత ఏడాది అమ్మకాలైన 53,792 యూనిట్లతో పోలిస్తే 16.7 శాతం వృద్ధితో 62,799 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ సాధించిన ఈ విజయంలో వారి కాంపాక్ట్ ఎస్‌యూవీ 'వెన్యూ' అత్యంత కీలక పాత్ర పోషించింది. ఒకే నెలలో ఏకంగా 13,017 వెన్యూ కార్లను డీలర్లకు సరఫరా చేయడం ద్వారా ఈ కారు తన ఆల్-టైమ్ బెస్ట్ సేల్స్ రికార్డును నమోదు చేసుకుంది.

దూసుకొస్తున్న కియా ఇండియా.. ఈవి విభాగంలో రికార్డు

టాప్-5 కార్ల తయారీ కంపెనీల జాబితాలో కియా ఇండియా 33,462 వాహనాల విక్రయాలతో ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టయోటా కిర్లోస్కర్ మోటార్‌ను కియా దాటేసింది. తమ సరికొత్త మోడళ్లు, సీఎన్‌జీ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించిందని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ నెలలో కియా ఇండియా తమ చరిత్రలోనే అత్యధిక నెలవారీ ఈవి విక్రయాలను నమోదు చేయడం విశేషం.

Tags: