Electric Vehicle Sales : భారత్‌లో ఎలక్ట్రిక్ సునామీ.. ఏడాదిలోనే 2 లక్షల కార్లు.. పెట్రోల్ బంకులకు మూతపడినట్లేనా ?

ఏడాదిలోనే 2 లక్షల కార్లు.. పెట్రోల్ బంకులకు మూతపడినట్లేనా ?

Update: 2026-04-09 08:59 GMT

Electric Vehicle Sales : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా మొదలైంది. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడుకు భయపడి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆటో డీలర్ల సంఘం FADA విడుదల చేసిన గణాంకాలు చూస్తుంటే, దేశంలో ఎలక్ట్రిక్ కార్ల విప్లవం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 2 లక్షల ఎలక్ట్రిక్ కార్లు రోడ్డెక్కడం విశేషం.

ఈవీ మార్కెట్ వాటా - భారీ జంప్

భారతదేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా అనూహ్యంగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.6 శాతంగా ఉన్న ఈవీల వాటా, 2026 నాటికి 4.2 శాతానికి చేరుకుంది. మొత్తం మీద ఈ ఏడాది 1,99,923 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. అంటే దాదాపు రెండు లక్షల మంది భారతీయులు కాలుష్య రహిత ప్రయాణానికి జై కొట్టారు. ఇందులో టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కలిసి ఏకంగా 87.3 శాతం మార్కెట్‌ను తమ గుప్పిట్లో ఉంచుకున్నాయి.

టాటా మోటార్స్.. అన్ డిస్ప్యూటెడ్ కింగ్

ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. గతేడాది కంటే 35.9 శాతం వృద్ధిని నమోదు చేస్తూ మొత్తం 78,811 యూనిట్లను విక్రయించింది. ముఖ్యంగా టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ మోడల్స్ కుర్రకారు నుంచి ఫ్యామిలీల వరకు అందరినీ ఆకట్టుకున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఉండటమే టాటా విజయానికి ప్రధాన కారణం.

మహీంద్రా మ్యాజిక్.. 407 శాతం వృద్ధి

ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచింది మహీంద్రా అండ్ మహీంద్రా. 2025లో కేవలం 8,426 కార్లు అమ్మిన మహీంద్రా, ఈ ఏడాది ఏకంగా 42,721 యూనిట్లను విక్రయించి 407 శాతం వృద్ధిని సాధించింది. ఇది ఆటోమొబైల్ రంగంలోనే ఒక అద్భుతం అని చెప్పాలి. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మార్కెట్లోకి రావడంతో కస్టమర్లు వాటిపై విపరీతమైన ఆసక్తిని చూపించారు.

ఎంజీ మోటార్, ఇతర కంపెనీలు

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ కూడా 53,089 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. వీటిలో విండ్సర్, కామెట్ ఈవీ మోడల్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అటు హ్యుందాయ్ కూడా క్రెటా ఈవీ పుణ్యమా అని 137 శాతం వృద్ధితో 5,885 కార్లు అమ్మింది. ప్రపంచ దిగ్గజం టెస్లా భారత్‌లో ఇంకా పుంజుకోవాల్సి ఉంది (కేవలం 342 యూనిట్లు). అటు మారుతీ సుజుకి కూడా తన ఈ-విటారా (eVitara) ద్వారా 1,416 యూనిట్లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. విన్‌ఫాస్ట్ వంటి కొత్త కంపెనీలు కూడా తమ ఉనికిని చాటుకుంటున్నాయి.

Tags:    

Similar News