Car Price Hike: ఏప్రిల్ ఫూల్ కాదు నిజం.. ఏప్రిల్ 1 నుంచి ఎంజీ మోటార్, టాటా కార్ల ధరల పెంపు
ఏప్రిల్ 1 నుంచి ఎంజీ మోటార్, టాటా కార్ల ధరల పెంపు
Car Price Hike: ప్రీమియం కార్ల ప్రియులకు షాకింగ్ న్యూస్. వాహన తయారీ సంస్థ జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పెరుగుతున్న తయారీ ఖర్చుల దృష్ట్యా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. భారత ఆటోమొబైల్ రంగంలో ధరల పెరుగుదల సెగ మొదలైంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన ఎంపిక చేసిన మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు 2026, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనాల తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. అయితే, ఎంజీ తన ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలైన MG M9, MG Cyberster ధరలను మాత్రం మార్చడం లేదు. ఇవి యథాతథంగా పాత ధరలకే లభిస్తాయి.
ఎంట్రీ లెవల్ నుంచి లగ్జరీ వరకు..
ప్రస్తుతం ఎంజీ మోటార్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. కంపెనీ వద్ద అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు MG Comet EV ధర రూ. 4.99 లక్షల నుండి ప్రారంభమవుతుండగా, టాప్-ఎండ్ ఎస్‌యూవీ MG Gloster ధర రూ.38 లక్షలకు పైగా ఉంది. ఇప్పుడు అమల్లోకి రాబోయే 2 శాతం పెంపు వల్ల గ్లోస్టర్ వంటి ఖరీదైన కార్లపై సుమారు రూ.75,000 వరకు భారం పడే అవకాశం ఉంది.
రేసులో టాటా, ఆడి, హ్యుందాయ్ కూడా!
కేవలం ఎంజీ మాత్రమే కాదు, ఇతర దిగ్గజ సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.
టాటా మోటార్స్: తన కమర్షియల్ వాహనాల (ట్రక్కులు, బస్సులు) ధరలను 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
ఆడి ఇండియా: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కూడా ఏప్రిల్ 1 నుంచి తమ కార్ల ధరలను 2 శాతం వరకు పెంచుతోంది.
హ్యుందాయ్, మారుతి: హ్యుందాయ్ మోటార్ ఇండియా, మారుతి సుజుకి కూడా ధరల పెంపుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఎందుకీ ధరల బాదుడు?
ఆటోమొబైల్ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్, ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు రవాణా ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గులు కంపెనీలపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. తయారీ వ్యయం పెరగడంతో ఆ భారాన్ని కొంతమేర కస్టమర్లపైకి బదిలీ చేయక తప్పడం లేదని వాహన తయారీదారులు చెబుతున్నారు. కాబట్టి, కొత్త కారు కొనాలనే ప్లాన్‌లో ఉంటే ఏప్రిల్ 1 లోపు కొనుగోలు చేయడం ద్వారా వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు.