Kia : కియా కనెక్టెడ్ మాయ..5 లక్షల కార్ల సేల్స్‌తో నయా రికార్డ్
5 లక్షల కార్ల సేల్స్‌తో నయా రికార్డ్
Kia : దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా మార్కెట్లో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2019లో భారత్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టెక్నాలజీ పరంగా ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు ఎదిగింది. తాజాగా కియా ఇండియా 5 లక్షల కనెక్టెడ్ కార్ల విక్రయాలను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం విలాసవంతమైన కార్లను అమ్మడమే కాకుండా, కారును ఒక స్మార్ట్ గ్యాడ్జెట్‌లా మార్చిన కియా టెక్నాలజీకి భారతీయులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ భారీ విజయంలో కియా సెల్టోస్ దే సింహభాగం. మొత్తం 5 లక్షల కనెక్టెడ్ కార్ల అమ్మకాల్లో ఏకంగా 70 శాతం వాటా ఒక్క సెల్టోస్ మోడల్‌దే కావడం విశేషం. అంటే కియా విక్రయిస్తున్న ప్రతి 10 కనెక్టెడ్ కార్లలో 7 కార్లు సెల్టోస్ వే ఉంటున్నాయి. సెల్టోస్ తర్వాత సోనెట్, క్యారెన్స్ మోడళ్లు కూడా ఈ రికార్డులో తమ వంతు పాత్ర పోషించాయి. 4.2 మీటర్ల నుంచి 4.4 మీటర్ల సెగ్మెంట్‌లో సెల్టోస్ ఇప్పుడు అజేయంగా దూసుకుపోతోంది.
కియా ఇండియా గణాంకాల ప్రకారం.. కంపెనీ దేశీయంగా విక్రయిస్తున్న మొత్తం ఎస్‌యూవీ, ఎంపీవీ వాహనాలలో సుమారు 40 శాతం కార్లు కియా కనెక్ట్ ఫీచర్లతోనే అమ్ముడవుతున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే భారతీయ కస్టమర్లు కేవలం కారు లుక్ లేదా మైలేజ్‌కే కాకుండా, అందులో ఉండే అత్యాధునిక డిజిటల్ ఫీచర్లు, స్మార్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టమవుతోంది.
కియా తన కనెక్టెడ్ కార్ ఫీచర్లను ప్రారంభంలో కస్టమర్లకు ఉచితంగా అందిస్తుంది. అయితే, ఆ ఉచిత కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా చాలా మంది కస్టమర్లు డబ్బులు చెల్లించి మరీ ఈ సర్వీసులను పునరుద్ధరించుకుంటున్నారు. రిమోట్ ద్వారా కారును స్టార్ట్ చేయడం, ఏసీ ఆన్ చేయడం, లైవ్ లొకేషన్ ట్రాక్ చేయడం వంటి ఫీచర్లు డ్రైవర్ల రోజువారీ జీవితంలో అంతర్భాగమైపోయాయని చెప్పడానికి ఇదే నిదర్శనం.
కియా కనెక్ట్ టెక్నాలజీ ద్వారా డ్రైవర్లకు రాజభోగం లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి
* ccNC (Connected Car Navigation Cockpit): అత్యాధునిక నావిగేషన్ అనుభవం.
* OTA అప్‌డేట్స్: సాఫ్ట్‌వేర్, మ్యాప్ అప్‌డేట్స్ కోసం షోరూంకి వెళ్లక్కర్లేదు, ఇంట్లోనే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి.
* డిజిటల్ కీ 2.0: ఫిజికల్ కీ అవసరం లేకుండా ఫోన్ ద్వారానే కారును ఆపరేట్ చేయొచ్చు.
* మల్టీలింగ్యువల్ వాయిస్ కమాండ్: మన భాషలోనే కారుకు సూచనలు ఇవ్వొచ్చు.
* సౌకర్యవంతమైన సేఫ్టీ: 360 డిగ్రీల వ్యూ మానిటర్, రిమోట్ డయాగ్నోస్టిక్స్ వంటివి కారు భద్రతను పెంచుతాయి.
* ఈవీ స్పెషల్: ఎలక్ట్రిక్ వాహనాల కోసం డ్రైవ్ గ్రీన్, స్మార్ట్ హోమ్ ఛార్జింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.