Kia Syros EV : భారత ఈవీ మార్కెట్లో కియా సంచలనం.. 520 కిమీ రేంజ్‌తో రానున్న సైరోస్ ఈవీ

520 కిమీ రేంజ్‌తో రానున్న సైరోస్ ఈవీ

Update: 2026-07-11 07:16 GMT

Kia Syros EV : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా సైరోస్ ఈవీని జూలై 2026 చివరి వారంలో ప్రపంచానికి పరిచయం చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. అనంతరం దీనిని ఆగస్టు 2026లో అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. భారత మార్కెట్లో కియా పోర్ట్‌ఫోలియోలోనే ఇది అత్యంత చిన్నది మరియు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించబోతోంది. ప్రస్తుతానికి మార్కెట్ నియామకాల ప్రకారం ఇది పెట్రోల్ మోడల్ ఆధారంగా రూపొందించిన ఈవీ వెర్షన్ అయినప్పటికీ, దీని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో అనేక ఈవీ మార్పులను కంపెనీ చేసింది.

ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై హల్చల్ చేస్తున్న టాటా నెక్సాన్ ఈవీ , మహీంద్రా XUV 3XO ఈవీ మోడళ్లకు ఈ కొత్త కియా సైరోస్ ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది. కియా సంస్థ తన పాపులర్ కేరెన్స్ క్లావిస్ ఈవీలో ఉపయోగించిన పవర్‌ఫుల్ బ్యాటరీ టెక్నాలజీనే ఈ సైరోస్ ఈవీలోనూ వాడుతోంది. ఇందులో వినియోగదారుల కోసం 42kWh, 51.4kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు 443 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఏకంగా 520 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను ఆఫర్ చేయనుంది. తక్కువ బరువు, కాంపాక్ట్ సైజ్ వల్ల ఇది మైలేజ్ పరంగా సెగ్మెంట్ బెస్ట్‌గా నిలవనుంది.

ఎలక్ట్రిక్ కార్లు కొనేవారిలో చాలామందికి బ్యాటరీ లైఫ్, దాని రీప్లేస్‌మెంట్ ఖర్చుల గురించే ప్రధాన ఆందోళన ఉంటుంది. ఈ భయాలను పోగొట్టేందుకు కియా ఇండియా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సైరోస్ ఈవీ కారుపై ఏకంగా 15 సంవత్సరాల వరకు లేదా లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీని అందించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ తరహా ఆఫర్ ఈ సెగ్మెంట్లోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. దీనితో పాటు వాహనంపై 3 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. కస్టమర్లు కావాలనుకుంటే దీనిని 7 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించుకునే సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు.

డిజైన్ పరంగా చూస్తే.. కియా సైరోస్ ఈవీలో సరికొత్త క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, గాలి నిరోధకతను తగ్గించేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏరో-ఫ్రెండ్లీ అల్లాయ్ వీల్స్, ఎడమవైపు ఫ్రంట్ ఫెండర్‌పై ఛార్జింగ్ ఫ్లాప్‌ను అమర్చారు. కారు లోపల లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండబోతోంది. అంతేకాకుండా, అత్యవసర సమయాల్లో ఇతర ఎలక్ట్రిక్ పరికరాలకు లేదా వేరే ఈవీ కార్లకు ఛార్జింగ్ ఇచ్చుకునేలా వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) వంటి అడ్వాన్స్‌డ్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్, నమ్మకమైన వారంటీ కోరుకునే భారతీయ మిడిల్ క్లాస్ ఈవీ ప్రియులకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

Tags:    

Similar News