KTM : అటెన్షన్ KTM రైడర్స్.. ఈ ప్రీమియం బైకుల్లో పెద్ద సమస్య.. రీకాల్ చేసిన కంపెనీ

ఈ ప్రీమియం బైకుల్లో పెద్ద సమస్య.. రీకాల్ చేసిన కంపెనీ

Update: 2025-12-08 06:11 GMT

KTM : ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కేటీఎం తమ ప్రీమియం 390 సిరీస్ కి చెందిన అంతర్జాతీయ మోడళ్లకు సంబంధించి ఒక గ్లోబల్ రీకాల్ను జారీ చేసింది. కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్ టెస్టులో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ గుర్తించింది. దీని కారణంగా బైక్ చాలా తక్కువ ఆర్పీఎం వద్ద నడుస్తున్నప్పుడు లేదా వేగాన్ని అకస్మాత్తుగా తగ్గించినప్పుడు ఇంజిన్ స్టాల్ అయ్యే ప్రమాదం ఉంది. రైడర్‌లకు ఎలాంటి అవాంఛిత భద్రతాపరమైన ప్రమాదం కలగకుండా ఉండేందుకు బ్రాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఏ మోడళ్లకు ఈ రీకాల్ వర్తిస్తుంది?

ఈ రీకాల్‌లో మొత్తం నాలుగు ముఖ్యమైన అంతర్జాతీయ మోడళ్లు ఉన్నాయి. అవి 390 డ్యూక్ (2024-2026), 390 ఎండ్యూరో ఆర్ (2025-2026), 390 ఎస్‌ఎంసీ ఆర్, 390 అడ్వెంచర్ ఆర్, 390 అడ్వెంచర్ ఎక్స్. అయితే, భారతదేశంలోని రైడర్‌లకు ఇది శుభవార్త. ఈ రీకాల్ భారతీయ మార్కెట్‌లో అమ్ముడవుతున్న బైకులకు వర్తించదు. ఇండియాలో అమ్ముడవుతున్న 390 సిరీస్ బైకుల్లో ఈ సమస్య గుర్తించబడలేదు.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, రైడర్ తక్కువ వేగంతో వెళుతున్నప్పుడు లేదా ట్రాఫిక్‌లో అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఇలాంటప్పుడు ఇంజిన్ స్టాల్ అయ్యి ఆగిపోవడం వలన బైక్ అదుపు తప్పి పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యూ-టర్న్ తీసుకునేటప్పుడు, లేదా నగర ట్రాఫిక్‌లో, ఆఫ్-రోడ్ రైడింగ్ సమయంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఇది రైడర్ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశం ఉంది.

ECU సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో పరిష్కారం

ఈ సమస్యను పరిష్కరించడానికి బైక్‌లోని ఏ పార్టును మార్చాల్సిన అవసరం లేదని KTM స్పష్టం చేసింది. ఈ సమస్యకు ప్రధాన కారణం ECU (ఇంజిన్ కంట్రోల్ యూనిట్) లోని సాఫ్ట్‌వేర్ మాత్రమే. ECU సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఇంజిన్ స్టాల్ అయ్యే సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అన్ని అధీకృత KTM సర్వీస్ సెంటర్లలో పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది.

రీకాల్ పరిధిలోకి వచ్చే అంతర్జాతీయ రైడర్‌లను కంపెనీ నేరుగా సంప్రదిస్తుంది. రైడర్‌లు తమ బైక్ ఈ రీకాల్‌కు అర్హత కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి దగ్గరలోని డీలర్‌షిప్‌ను సంప్రదించాలని సూచించింది. అంతేకాకుండా ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వల్ల ఇంజిన్ స్మూత్‌నెస్ మరింత మెరుగవుతుందని కంపెనీ హామీ ఇచ్చింది.

Tags:    

Similar News