e-Vitara : ప్రపంచం మొత్తం ఈ కారుదే.. ఐదు ఖండాల్లో భారత్ సత్తా చాటనున్న మారుతి
ఐదు ఖండాల్లో భారత్ సత్తా చాటనున్న మారుతి;
e-Vitara : భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది కేవలం మారుతి సుజుకికి మాత్రమే కాదు, సుజుకి మోటార్ కార్పొరేషన్‌కు కూడా తొలి ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్లాంట్ నుండి ఈ-విటారా రోల్-అవుట్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రపంచంలోని 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ-విటారా కారు సెప్టెంబర్ 3న భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ లాంచ్‌తో మారుతి సుజుకి ఇప్పటికే టాటా మోటార్స్, ఎంజీ, మహీంద్రా వంటి కంపెనీలు ఆధిపత్యం వహిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లోకి ప్రవేశించనుంది. ఈ మార్కెట్‌లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, మారుతి ఈ-విటారా ద్వారా ఒక పెద్ద ప్లేయర్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో తయారైన ఈ ఎస్‌యూవీ ఆర్కిటిక్, అంటార్కిటికా మినహా ప్రపంచంలోని అన్ని ఖండాలకు ఎగుమతి కానుంది. ఈ చర్య భారత ఆటో పరిశ్రమకు, కంపెనీ గ్లోబల్ వ్యూహానికి ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది.
మారుతి సుజుకి ఇండియా కార్పొరేట్ అఫైర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ.. ఈ-విటారా 100కు పైగా దేశాలకు పంపబడుతుందని తెలిపారు. ముఖ్యంగా యూరప్, జపాన్ దీనికి అతిపెద్ద మార్కెట్లుగా ఉంటాయని ఆయన చెప్పారు. ఆర్కిటిక్, అంటార్కిటికా మినహా యూరప్, జపాన్‌తో సహా అన్ని ఖండాలకు ఈ-విటారాను పంపుతాము. దీనితో పాటు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా దీని మార్కెట్లుగా ఉంటాయని ఆయన వివరించారు.
ఈ ఎస్‌యూవీ ఒక ప్రత్యేకమైన ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. అడ్వాన్సుడ్ టెక్నాలజీతో పాటు అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఇది 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. మారుతి సుజుకి దీనిని ఒక పవర్ఫుల్ ప్రొడక్టుగా భావిస్తోంది. మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తోంది. ఈ-విటారా ఉత్పత్తి మారుతి సుజుకి గుజరాత్ ఈవీ ప్లాంట్‌లో జరుగుతుంది. ఈ ప్లాంట్ మొత్తం ఉత్పత్తి కెపాసిటీ సంవత్సరానికి 7.5 లక్షల యూనిట్లు. దీనిలో మూడు ప్రొడక్షన్ లైన్లు ఉన్నాయి. ఇటీవల ప్రారంభమైన మూడవ ప్రొడక్షన్ లైన్ నుండి ఎలక్ట్రిక్,పెట్రోల్/డీజిల్ వాహనాలు రెండింటినీ తయారు చేయవచ్చు. ఈ లైన్ యాన్యువల్ కెపాసిటీ 2.5 లక్షల యూనిట్లు.