Mahindra : జీఎస్టీ ఎఫెక్ట్.. .9 రోజుల్లో ఎస్యూవీ సేల్స్‌లో దుమ్ములేపిన మహీంద్రా
9 రోజుల్లో ఎస్యూవీ సేల్స్‌లో దుమ్ములేపిన మహీంద్రా
Mahindra : భారతీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లతో పోలిస్తే, ఎస్యూవీల పట్ల కస్టమర్లలో క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ అమ్మకాలు పెరగడానికి అతిపెద్ద కారణం.. ఇటీవల ప్రభుత్వం జీఎస్‌టీ రేటును (28% నుంచి 18%కి) తగ్గించడం వల్ల కార్ల ధరలు తగ్గడం. జీఎస్‌టీలో ఈ తగ్గింపు కారణంగా ఎస్‌యూవీల విక్రయాలలో అద్భుతమైన పెరుగుదల కనిపించింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేసింది. నవరాత్రి 2025 పండుగ సమయంలో తమ ఎస్‌యూవీల రిటైల్ అమ్మకాలు ఏకంగా 60 శాతం పెరిగాయని ఆ సంస్థ వెల్లడించింది.
ఎస్‌యూవీల విక్రయాలు కేవలం పెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాల్లో, గ్రామీణ మార్కెట్లలో కూడా భారీగా పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ నళినీకాంత్ గొల్లాగుంట ఈ విషయాన్ని తెలియజేశారు. నవరాత్రి మొదటి తొమ్మిది రోజుల్లో డీలర్లు రిపోర్ట్ చేసిన రిటైల్ సేల్స్, గతేడాది నవరాత్రి తొమ్మిది రోజులతో పోలిస్తే దాదాపు 60 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. చాలా మంది కస్టమర్లు జీఎస్‌టీ తగ్గింపు కోసం వేచి చూశారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్‌టీ రేటు అమలులోకి రావడం, నవరాత్రి ప్రారంభం కావడంతో, కార్ల అమ్మకాల్లో భారీ జంప్ నమోదైంది.
నళినీకాంత్ రిటైల్ అమ్మకాల్లో వచ్చిన ఈ 60 శాతం వృద్ధి గురించి ప్రకటిస్తూనే.. తమ కంపెనీ కొత్త బోలెరో సిరీసుకు గ్రామీణ మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ కనిపిస్తోందని తెలిపారు. కస్టమర్ల అభిప్రాయాన్ని బట్టి బొలేరో మంచి ఫీచర్లను కొనసాగిస్తూనే, దానికి కొత్త ఫీచర్లను జోడించి మార్కెట్లోకి విడుదల చేశామని ఆయన చెప్పారు. ఇప్పుడు కొత్త బొలేరో శ్రేణిలో కస్టమర్లు అద్భుతమైన ఇంజిన్ పర్ఫామెన్స్, స్ట్రాంగ్ బాడీ ఆన్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ తో పాటు కొత్త ఫీచర్లు, ఇన్ఫోటైన్‌మెంట్ సౌకర్యాలను కూడా పొందవచ్చు. బొలెరో కొత్త శ్రేణి ధర రూ.7.99 లక్షల నుంచి మొదలై, రూ.9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.