Car Sales : వెనుకబడిపోయిన ఫార్చ్యూనర్.. టాటా హారియర్, సఫారీ అమ్మకాల పరిస్థితి ఎలా ఉందంటే?

సఫారీ అమ్మకాల పరిస్థితి ఎలా ఉందంటే?

Update: 2026-07-18 14:34 GMT

Car Sales : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్ల మధ్య పోటీ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. అయితే జూన్ 2026 నెలవారీ కార్ల విక్రయాల నివేదిక ప్రకారం.. మహీంద్రా స్కార్పియో మరోసారి మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. 4.5 మీటర్ల నుంచి 4.8 మీటర్ల పొడవు గల మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో స్కార్పియో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. అంతేకాకుండా మొత్తం ఎస్‌యూవీ మార్కెట్ లోనే ఒకే నెలలో 10 వేల కంటే ఎక్కువ యూనిట్ల విక్రయాలను నమోదు చేసిన ఏకైక కారుగా స్కార్పియో రికార్డు సృష్టించడం విశేషం.

జూన్ 2026 సేల్స్ రిపోర్ట్ విడుదల

గడచిన జూన్ 2026 నెలలో మహీంద్రా కంపెనీ ఏకంగా 14,097 యూనిట్ల స్కార్పియో కార్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. గతేడాది ఇదే జూన్ 2025 నెలలో ఈ అమ్మకాల సంఖ్య 12,740 యూనిట్లుగా ఉంది. అంటే ఏడాది కాలంలోనే స్కార్పియో విక్రయాల్లో 1,357 యూనిట్ల భారీ వృద్ధి నమోదైంది. దాదాపు 10.65 శాతం వార్షిక వృద్ధితో 37 శాతానికి పైగా మార్కెట్ వాటాను సొంతం చేసుకుని ఈ సెగ్మెంట్‌లో స్కార్పియో రారాజుగా నిలిచింది. ఈ గణాంకాలను బట్టి భారతీయ వాహనదారుల్లో స్కార్పియో బ్రాండ్ పట్ల ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.

టాప్-3 స్థానాలు మహీంద్రావే

ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాప్-3 స్థానాలను మహీంద్రా కంపెనీయే పూర్తిగా ఆక్రమించడం విశేషం. ఈ జాబితాలో రెండో స్థానంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 నిలిచింది. జూన్ 2026లో ఈ కారు 9,244 యూనిట్ల విక్రయాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే దీని అమ్మకాల్లో 2,809 యూనిట్ల భారీ పెరుగుదల కనిపించింది. ఇక మూడో స్థానంలో మహీంద్రా నుంచి కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ మోడల్ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ నిలిచింది. మార్కెట్లోకి వచ్చిన తొలిరోజుల్లోనే ఇది 4,018 యూనిట్ల అమ్మకాలను జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కంపెనీ పాత మోడళ్లతో పాటు కొత్తగా తెస్తున్న ఈవీ కార్లను కూడా కస్టమర్లు బాగా ఆదరిస్తున్నారని దీని ద్వారా అర్థమవుతోంది.

వెనుకబడిపోయిన టయోటా ఫార్చ్యూనర్

ధర, లగ్జరీ పరంగా ఎంతో పాపులర్ అయిన టయోటా ఫార్చ్యూనర్ ఈసారి అమ్మకాల్లో ఐదో స్థానానికి పడిపోయింది. జూన్ 2026లో కేవలం 2,514 ఫార్చ్యూనర్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాది జూన్ నెలలో జరిగిన 2,743 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే టొయోటా విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కు చెందిన టాటా హారియర్ 2,962 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో నిలిచి గత ఏడాది కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. టాటా సఫారీ అమ్మకాలు కూడా పెరిగి 1,271 యూనిట్లకు చేరుకున్నప్పటికీ, మహీంద్రా స్కార్పియో విక్రయాలతో పోలిస్తే ఇది చాలా వెనుకబడి ఉందనే చెప్పాలి.

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 29 శాతం బంపర్ గ్రోత్

మొత్తంగా చూసుకుంటే ఈ 4.5 నుంచి 4.8 మీటర్ల పొడవు గల ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో జూన్ 2026 నెలలో అన్ని కంపెనీలవి కలిపి మొత్తం 37,763 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సేల్స్ కౌంట్ 29,209 యూనిట్లుగా మాత్రమే నమోదైంది. అంటే ఈ ఒక్క సెగ్మెంట్ లోనే ఏడాది కాలంలో సుమారు 29.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. భారతీయులు చిన్న కార్ల కంటే పెద్దగా, పవర్‌ఫుల్‌గా ఉండే ఎస్‌యూవీ కార్లను కొనడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఈ మార్కెట్ ట్రెండ్ స్పష్టం చేస్తోంది.

గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్

మహీంద్రా స్కార్పియో-ఎన్ మోడల్ ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడవడానికి ప్రధాన కారణం దాని పవర్‌ఫుల్ ఇంజిన్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు. ఈ కారులో 2.0 లీటర్ ఎంస్టాలియన్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. అంతేకాకుండా, కఠినమైన ఆఫ్-రోడింగ్ కోసం ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. భద్రత పరంగా ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీనితో పాటు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సి-షేప్డ్ డీఆర్ఎల్స్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, ప్రీమియం లుక్ కస్టమర్లను మొదటి చూపులోనే కట్టిపడేస్తున్నాయి.

Tags:    

Similar News