Car Maintenance : మెకానిక్ లేకుండా మీ కారును మెరిసేలా చేయాలా.. ఈ టిప్స్ పాటించండి
ఈ టిప్స్ పాటించండి;
Car Maintenance : కారులో ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ప్రతిసారీ మెకానిక్ దగ్గరకు వెళ్లడం ఇబ్బందిగా అనిపిస్తే, ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా కారును మీరే చూసుకోవచ్చు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, మీ కారు సిస్టమ్ అర్థం చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇంట్లో కూర్చొని కారును ఎలా మెరిపించవచ్చో కొన్నిచిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటగా మీ కారు బోనెట్‌ను ఎలా తెరవాలో తెలుసుకోండి. దీనివల్ల మీకు ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్రేక్ ఆయిల్, వాషర్ లిక్విడ్ స్థితి అర్థమవుతుంది. వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. వాటి లెవల్ తక్కువగా ఉంటే, మాన్యువల్ చూసి వాటిని మీరే నింపడం చాలా ఈజీ. కారు ఎయిర్ ఫిల్టర్ దుమ్ము, ధూళితో త్వరగా మూసుకుపోవచ్చు, దీనివల్ల ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. దానిని తీసివేసి ఒక శుభ్రమైన బ్రష్‌తో లేదా గాలి సహాయంతో శుభ్రం చేయవచ్చు. ప్రతి 5,000-10,000 కిలోమీటర్లకు ఒకసారి దీనిని చెక్ చేయడం మంచిది.
ప్రతి పెట్రోల్ బంకులో ఎయిర్ పంప్ ఉంటుంది. అక్కడ మీ టైర్ ప్రెజర్‌ను మీరే చెక్ చేసి, సరిచేసుకోవచ్చు. ప్రతి వారం ఒకసారి టైర్ ప్రెజర్‌ను చెక్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా వేసవి, చలికాలంలో. సరైన టైర్ ప్రెజర్ మెరుగైన మైలేజ్, సేఫ్టీని అందిస్తుంది. బ్యాటరీ టెర్మినల్స్‌పై తరచుగా తెల్లటి లేదా ఆకుపచ్చటి తుప్పు పడుతుంది. దీనివల్ల కారు స్టార్ట్ అవ్వడంలో సమస్యలు రావచ్చు. పాత బ్రష్, బేకింగ్ సోడా ఉపయోగించి దీనిని ఈజీగా శుభ్రం చేయవచ్చు. తర్వాత, తుప్పు పట్టకుండా ఉండటానికి టెర్మినల్స్‌పై కొద్దిగా వాసెలిన్ రాయండి.
వర్షాకాలంలో వైపర్ల సరైన పర్ఫామెన్స్ చాలా అవసరం. వైపర్ బ్లేడ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. రబ్బర్ అరిగిపోయినట్లయితే, కొత్త బ్లేడ్‌ను మీరే అమర్చుకోవడం చాలా ఈజీ. వాషర్ ట్యాంక్‌లో నార్మల్ వాటర్ లేదా వైపర్ లిక్విడ్ పోసి శుభ్రం చేయండి. కారులోని ఏదైనా లైట్ పనిచేయకపోతే, ముందుగా దాని ఫ్యూజ్‌ను తనిఖీ చేయండి. కారు మాన్యువల్‌లో ఫ్యూజ్ బాక్స్ గురించి సమాచారం ఉంటుంది. ఫ్యూజ్‌లు చవకగా లభిస్తాయి. వాటిని మార్చడం చాలా సులభం.