Maruti E-Vitara : 543 కి.మీ రేంజ్, 5-స్టార్ సేఫ్టీ.. మారుతి తొలి ఈవీ ఈ-విటారా ఫీచర్లు ఇవే

మారుతి తొలి ఈవీ ఈ-విటారా ఫీచర్లు ఇవే

Update: 2025-12-03 14:12 GMT

Maruti E-Vitara : భారతీయ మార్కెట్‌లో కార్ల అమ్మకాల రారాజు అయిన మారుతి సుజుకి తమ మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి ఈ-విటారాను మరోసారి ప్రదర్శించింది. గతంలో జనవరి 2025 ఆటో ఎక్స్‌పోలో చూపించిన ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, డెలివరీ తేదీ వంటి కీలక సమాచారాన్ని ఈసారి కంపెనీ వెల్లడించింది. భారతీయ ఈవీ సెగ్మెంట్‌లో మారుతికి ఇది అతిపెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.

మారుతి ఈ-విటారా రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది: 49 kWh, 61 kWh. ఇందులో పెద్ద బ్యాటరీ అయిన 61 kWh తో కూడిన ఎస్‌యూవీ, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల ARAI రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ రేంజ్ కారణంగా మారుతి ఈ-విటారా లాంగ్ జర్నీలకు కూడా మంచి ఎంపికగా నిలవనుంది.

ఈ-విటారా ఒక మోడ్రన్ ఈవీగా నిలిచేందుకు అనేక అద్భుతమైన ఫీచర్లను ఇందులో జోడించారు. ముఖ్యంగా దీనిలో పెద్ద 26.04 cm డిజిటల్ డిస్‌ప్లే, వెంట్ సిస్టం ఉన్న సీట్లు, పవర్‌తో అడ్జస్ట్ చేయగలిగే డ్రైవర్ సీటు, సులభంగా స్లైడ్ అయ్యే వెనుక సీట్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. వీటితో పాటు, LED లైట్స్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో నార్మల్ మోడ్, రీజెన్ మోడ్, స్నో మోడ్ వంటి విభిన్న డ్రైవింగ్ మోడ్‌లు కూడా లభిస్తాయి.

భద్రత విషయంలో మారుతి సుజుకి ఈసారి అస్సలు రాజీ పడలేదు. ఈ ఎస్‌యూవీలో అత్యంత ముఖ్యమైన లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ను అందించారు. అలాగే, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, ABS, EBD, ESP, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి పూర్తి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు భారత NCAP క్రాష్ టెస్ట్‌లో ఇప్పటికే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది, ఇది కస్టమర్‌లకు భద్రత పట్ల పూర్తి నమ్మకాన్ని ఇస్తుంది.

మారుతి సుజుకి ఈ-విటారా డెలివరీలు 2026 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. దీనికి ముందు కంపెనీ దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోంది. ఇప్పటికే 1100 నగరాల్లో దాదాపు 2000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయగా, 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. ముఖ్యంగా ఈ SUVను BaaS ఆప్షన్‌తో కూడా అందిస్తారు. అంటే, కస్టమర్లు బ్యాటరీని అద్దెకు తీసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.

మారుతి ఈ-విటారా మార్కెట్‌లో రాగానే గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన ప్రత్యర్థులు..హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ విండ్సర్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ 6, టాటా హారియర్ ఈవీ వంటి మోడళ్లు. ఈ రేంజ్, ఫీచర్లతో మారుతి ఈ-విటారా మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News