Maruti Suzuki : మారుతి భారీ ప్లాన్.. 5 ఏళ్లలో 9 కొత్త ఎస్‌యూవీలు, ఎంపీవీలు

5 ఏళ్లలో 9 కొత్త ఎస్‌యూవీలు, ఎంపీవీలు

Update: 2025-10-24 14:17 GMT

Maruti Suzuki : భారతదేశంలో కార్ల మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి, రాబోయే ఐదేళ్ల కాలానికి భారీ విస్తరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఎస్‌యూవీ, ఎంపీవీ సెగ్మెంట్లో తన పట్టును పెంచుకోవడానికి కంపెనీ సిద్ధమవుతోంది. రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ధరలలో పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, ఫ్లెక్స్-ఫ్యూయల్ ఆప్షన్లతో సహా మొత్తం తొమ్మిది కొత్త యూటిలిటీ వాహనాలను లాంచ్ చేయాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది. 2031 నాటికి తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 మిలియన్ యూనిట్లకు పెంచాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది.

మారుతి సుజుకి కంపెనీ రాబోయే ఐదేళ్లలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. కంపెనీ తన ప్రస్తుత వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.35 మిలియన్ యూనిట్ల నుంచి 2031 నాటికి ఏకంగా 4 మిలియన్ యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు ఎగుమతులను కూడా విస్తరించాలని యోచిస్తోంది. కొత్తగా రాబోయే తొమ్మిది యూటిలిటీ వాహనాల్లో పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, ఫ్లెక్స్-ఫ్యూయల్ వంటి అనేక రకాల పవర్‌ట్రైన్ ఆప్షన్లు ఉంటాయి.

ఎలక్ట్రిక్ విభాగంలో తొలి అడుగు: ఈ-విటారా

మారుతి సుజుకి నుంచి రాబోయే తదుపరి మోడల్, పూర్తిగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన మారుతి ఈ-విటారా. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2025 డిసెంబర్‌లో మార్కెట్‌లోకి రానుంది. ఇది 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. హై-స్పెక్ వేరియంట్ 500 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందించే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది.

కొత్త హైబ్రిడ్, ఎస్‌యూవీ మోడల్స్

ఈ-విటారా తర్వాత, మారుతి తన స్వంతంగా అభివృద్ధి చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో కూడిన కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఫ్రాంక్స్ మోడల్‌లో మారుతి సుజుకి తన 1.2 లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను హైబ్రిడైజ్ చేయవచ్చు. ఇది 35 కి.మీ/లీ కంటే ఎక్కువ మైలేజీని ఇచ్చే అవకాశం ఉంది. మారుతి నుంచి ప్రీమియం 7-సీటర్ ఎస్‌యూవీ కూడా రానుంది. ఇది గ్రాండ్ విటారా ఆధారంగా రూపొందించబడుతుంది. 4.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. గ్రాండ్ విటారా ప్లాట్‌ఫామ్, పవర్‌ట్రైన్, ఫీచర్లను ఇది కలిగి ఉండే అవకాశం ఉంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎంపీవీ ప్రణాళికలు

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ విభాగంలోనూ కొత్త మోడల్‌తో పోటీని పెంచేందుకు సిద్ధమవుతోంది. మారుతి సుజుకి టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‎లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఒక కొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీను అభివృద్ధి చేస్తోంది. ఇది బ్రెజా ఆధారితంగా ఉండవచ్చు. స్విఫ్ట్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంటుంది. రాబోయే మోడళ్ల జాబితాలో ఒక సబ్‌కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎంపీవీ, ఒక చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఉన్నాయి. వీటితో పాటు జపనీస్-స్పెక్ స్పేషియా ఆధారంగా రూపొందించిన మూడు వరుసల కాంపాక్ట్ ఎంపీవీను కూడా 2026లో ప్రవేశపెట్టనున్నారు.

బ్రెజా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ అప్‌గ్రేడ్

మారుతి అత్యంత ప్రజాదరణ పొందిన బ్రెజా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీకి కూడా జనరేషన్ అప్‌గ్రేడ్ ఇవ్వనున్నారు. 2029లో బ్రెజా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీకి కొత్త జనరేషన్ అప్‌గ్రేడ్ లభిస్తుంది. ఈ కొత్త మోడల్లో కొత్త డిజైన్, ఫీచర్లు, మారుతి కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ కూడా లభిస్తాయి.

Tags:    

Similar News