Maruti Victoris : మారుతీ సుజుకి కొత్త కారు.. అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు
అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు
Maruti Victoris : భారత మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకోవాలని మారుతీ సుజుకి సరికొత్త ఎస్‌యూవీ విక్టోరిస్‌ను ఆవిష్కరించింది. ఈ కారు మార్కెట్లోకి రాకముందే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో సంచలనం సృష్టిస్తోంది. సేఫ్టీ ఫీచర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదని పేరున్న మారుతీ నుంచి ఇలాంటి కారు రావడం వినియోగదారులకు పెద్ద సర్ ప్రైజ్. మారూతి సుజుకి ఈ కొత్త ఎస్‌యూవీ విక్టోరిస్‌ను త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఈ కారుకు భారత NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ లభించింది. ZXI+, ZXI+(O), ZXI+(O) 6AT వంటి అన్ని వేరియంట్లలో ఈ రేటింగ్ వర్తిస్తుంది. అంటే కారు ఏ మోడల్ కొనుగోలు చేసినా సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కారును సుజుకి కొత్త గ్లోబల్ సి-ప్లాట్‌ఫామ్ మీద తయారు చేశారు. ఇది అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లను కలిగి ఉంది. మారుతీ సుజుకి దీనిని తమ ఎరీనా అవుట్‌లెట్ల ద్వారా విక్రయించనుంది.
విక్టోరిస్ ఎస్‌యూవీలో అతిపెద్ద ప్రత్యేకత దాని సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ. మారుతీ సుజుకి ఈ ఫీచర్లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా అందించింది. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), పాదచారుల రక్షణ వ్యవస్థ, సైడ్ హెడ్ ప్రొటెక్షన్ ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్‌లు వంటివి ఉన్నాయి. వీటితో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఇందులో లభిస్తుంది.
పెద్దల సేఫ్టీ విషయంలో మారుతీ విక్టోరిస్ అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి, 32 పాయింట్లకు గాను 31.66 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డీఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 15.66 పాయింట్లు, సైడ్ మూవబుల్ డీఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 16 పాయింట్లు సాధించింది. అంతేకాకుండా, సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో ఓకే రేటింగ్ లభించింది. ఈ కారులో ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, లోడ్ లిమిటర్లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇవన్నీ కారు ప్రయాణికుల సేఫ్టీకి ఎంతగానో ఉపయోగపడతాయి.
పిల్లల సేఫ్టీ విషయంలో కూడా మారుతీ విక్టోరిస్ మంచి పర్ఫామెన్స్ కనబరిచి, 49 పాయింట్లకు గాను 43 పాయింట్లు సాధించింది. డైనమిక్ అసెస్‌మెంట్‌లో 24కి 24 పాయింట్లు సాధించడం ద్వారా క్రాష్ టెస్ట్‌లో పిల్లల డమ్మీలు సురక్షితంగా ఉన్నాయని నిరూపించింది. చైల్డ్ రెస్ట్రయింట్ సిస్టమ్ (CRS) ఇన్‌స్టాలేషన్ విభాగంలో కూడా 12కి 12 పాయింట్లు సాధించింది. ఇది ISOFIX, i-Size సిస్టమ్‌లకు అనుకూలంగా ఉందని ఇది స్పష్టం చేస్తుంది. అయితే, వెహికల్ అసెస్‌మెంట్ స్కోర్ 13కి 7 పాయింట్లు మాత్రమే ఉంది. అయినప్పటికీ 18 నెలలు, 3 ఏళ్ల పిల్లల డమ్మీలకు మంచి సేఫ్టీ లభించింది.