Matter : ఒక్క కిలోమీటర్‌కు 25 పైసలే ఖర్చు... మేటర్ ఎరా మార్కెట్ ఖాళీ చేయడం ఖాయం

మేటర్ ఎరా మార్కెట్ ఖాళీ చేయడం ఖాయం;

Update: 2025-07-04 14:37 GMT

Matter : ఈ రోజుల్లో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి మేలు చేసే వాహనాల వైపు జనం చూస్తున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి భారతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ 'మేటర్' కంపెనీ తమ కొత్త 'ఎరా' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఢిల్లీలో విడుదల చేసింది. ఇది మామూలు బైక్ కాదు, భారతదేశంలోనే తొలి గేర్ల ఎలక్ట్రిక్ టూ-వీలర్ అని కంపెనీ చెబుతోంది. మేటర్ ఎరా బైక్ ధర రూ.1,93,826 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్‌ను కొనాలనుకుంటే కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీ లాంటి రద్దీగా ఉండే, కాలుష్యంతో నిండిన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల ఆసక్తి పెరుగుతున్న సమయంలో ఈ బైక్‌ను విడుదల చేయడం గమనార్హం. ఎరా బైక్ ప్రత్యేకత దాని 'హైపర్‌షిఫ్ట్' ట్రాన్స్‌మిషన్ సిస్టమ్. ఇది కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్. సాధారణంగా చాలా ఎలక్ట్రిక్ టూ-వీలర్లు గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండా, నేరుగా యాక్సిలరేటర్‌తో నడుస్తాయి. కానీ ఎరాలో మాత్రం గేర్లు మార్చుకుంటూ వెళ్లే అనుభూతిని పొందవచ్చు.

ఈ గేర్ సిస్టమ్‌ను మూడు రైడ్ మోడ్స్‌తో కలిపారు. దీనివల్ల మొత్తం 12 గేర్-మోడ్ కాంబినేషన్లు అందుబాటులో ఉంటాయి. మేటర్ ఎరాలో లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఉంది. దీన్ని కూడా మేటర్ కంపెనీనే తయారు చేసింది. ఇందులో 5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీతో బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 172 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని కంపెనీ చెబుతోంది. ఇక స్పీడ్ విషయానికి వస్తే.. ఈ బైక్ 2.8 సెకన్లలోపే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అంటే చాలా వేగంగా దూసుకుపోతుంది.

ఇందులో బైక్ హ్యాండిల్ దగ్గర 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో నావిగేషన్, బైక్ నడిపిన వివరాలు, మ్యూజిక్ కంట్రోల్ లాంటివి ఉంటాయి. మీ మొబైల్ ఫోన్‌కు అప్‌డేట్స్ వచ్చినట్లుగానే, ఈ బైక్‌కు కూడా ఇంటర్నెట్ ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయి. మేటర్‌వర్స్ యాప్ ద్వారా బైక్‌ను రిమోట్‌గా లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, రైడ్ అనలిటిక్స్ లాంటివి తెలుసుకోవచ్చు. సేఫ్టీ కోసం ABSతో కూడిన డ్యూయల్-డిస్క్ సెటప్, డ్యూయల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి. కీ లేకుండానే బైక్‌ను స్టార్ట్ చేసే సదుపాయం ఉంది. ఈ బైక్‌ను నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఒక కిలోమీటర్‌కు కేవలం 25 పైసలు మాత్రమే ఖర్చవుతుందట. పెట్రోల్ బైకులతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ.

Tags:    

Similar News