Car Sales : ఆటోమొబైల్ రంగానికి కలిసొచ్చిన జీఎస్టీ.. గంటకు 1000కి పైగా కార్లు సేల్

గంటకు 1000కి పైగా కార్లు సేల్

Update: 2025-10-09 11:22 GMT

Car Sales : భారతదేశంలో పండుగలు వచ్చాయంటే కొనుగోళ్ల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా నవరాత్రి సమయంలో ప్రజలు కొత్త వాహనాలను కొనడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది నవరాత్రి పండుగ ఆటోమొబైల్ రంగానికి ఊహించని ఉత్సాహాన్ని ఇచ్చింది. పండుగల కోసం కొనుగోళ్లను వాయిదా వేసిన ప్రజలు, మరోవైపు ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం వంటి కారణాల వల్ల కార్ల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. దీనితో సెప్టెంబర్ నెలలో కాస్త నెమ్మదిగా ఉన్న వాహన షోరూమ్‌లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నవరాత్రి తొమ్మిది రోజుల్లో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 35 శాతం పెరిగాయి. ఈ తొమ్మిది రోజుల్లో మొత్తం 2.17 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. అంటే, ప్రతి గంటకు సుమారు 1,250 కార్లు అమ్ముడైనట్లు లెక్క. నెల ప్రారంభంలో కస్టమర్లు లేక వెలవెలబోయిన షోరూమ్‌లు, నవరాత్రి సమయంలో అర్ధరాత్రి వరకు టెస్ట్ డ్రైవ్‌లు అందిస్తూ, పెద్ద ఎత్తున వాహనాలను డెలివరీ చేశాయి.

సెప్టెంబర్ నెల ప్రారంభ మూడు వారాలు కస్టమర్లు కొత్త జీఎస్టీ రేట్ల కోసం ఎదురుచూశారు. కానీ, నవరాత్రి రాక, ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం రెండూ ఒకేసారి జరగడంతో ఆటో ఇండస్ట్రీకి కొత్త ఎనర్జీని వచ్చింది. జీఎస్టీ రేట్లు తగ్గడం, పండుగ ఆఫర్లు ఉండటంతో వాహనాల ధరలు మరింత అందుబాటులోకి వచ్చాయని, ఇది కొనుగోళ్లకు బాగా దోహదపడిందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద సెప్టెంబర్ నెలలో వాహనాల నమోదు 6 శాతం పెరిగి 18.27 లక్షల యూనిట్లకు చేరుకుంది.

ఈ కొనుగోళ్ల ఉత్సాహం దసరా, దీపావళి వరకు కొనసాగే అవకాశం ఉందని ఆటో డీలర్లు నమ్మకంగా ఉన్నారు. FADA సంస్థ అంచనా ప్రకారం, ఈ ఏడాది పండుగ సీజన్ భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని పండుగ సీజన్ల కంటే అతిపెద్దది కావొచ్చు. జీఎస్టీ రేట్ల తగ్గింపు, రైతులకు పెరిగిన ఆదాయం, స్థిరంగా ఉన్న వడ్డీ రేట్లు వంటి అంశాలు కొనుగోలుదారులలో నమ్మకాన్ని పెంచాయి. సరఫరా గొలుసులో ఎటువంటి సమస్యలు రాకపోతే, ఈ అక్టోబర్ నెల భారత ఆటో ఇండస్ట్రీ చరిత్రలోనే అతిపెద్ద నెలగా రికార్డ్ సృష్టించే అవకాశం ఉందని ఫాడా తెలిపింది.

Tags:    

Similar News