Hyundai Venue : టాటా నెక్సాన్ కు గట్టి పోటీ.. స్పోర్టీ లుక్‌లో కొత్త వెన్యూ ఎన్ లైన్
స్పోర్టీ లుక్‌లో కొత్త వెన్యూ ఎన్ లైన్
Hyundai Venue : హ్యుందాయ్ మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ వెన్యూకు కొత్త రూపు తీసుకురాబోతోంది. సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ మోడల్ టెస్టింగ్ దశలో ఉండగా, దానికి సంబంధించిన అనేక కీలక వివరాలు బయటపడ్డాయి. ఈ కొత్త వెన్యూ ఎన్ లైన్, తన స్పోర్టీ లుక్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
కొత్త వెన్యూ ఎన్ లైన్‌లో కనిపించిన టాప్ 5 హైలైట్స్ ఇవే
డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్‌లు: టెస్టింగ్ సమయంలో బయటపడిన ఫోటోలలో, కారుకు డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్‌లు (రెండు సైలెన్సర్‌లు) స్పష్టంగా కనిపించాయి. ఇది స్టాండర్డ్ ఎస్‌యూవీ కంటే ఈ మోడల్ స్పోర్టియర్ లుక్‌ను కలిగి ఉందని, ప్రస్తుత వెన్యూ ఎన్ లైన్ లాగానే ఉంటుందని సూచిస్తుంది.
డైనమిక్ టర్న్ ఇండికేటర్లు: 2025 హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ డిజైన్‌లో డైనమిక్ టర్న్ ఇండికేటర్లు (రన్నింగ్ ఇండికేటర్లు) ఉండనున్నాయి. ఇది ఆధునిక, ప్రీమియం స్టైలింగ్ ఎలిమెంట్. హ్యుందాయ్ తన సెకండ్ జనరేషన్ వెన్యూ స్టాండర్డ్, ఎన్ లైన్ వెర్షన్లలో ఈ ఫీచర్‌ను మొదటిసారిగా అందించనుంది.
ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్: వెన్యూ లేదా వెన్యూ ఎన్ లైన్‌లో మొదటిసారిగా ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్ ఉండనుంది. టెస్ట్ మోడల్‌లో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, వెనుక భాగంలో పూర్తిగా కనెక్ట్ అయిన ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు కూడా కనిపించాయి. ఈ ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్ అప్‌కమింగ్ వెన్యూ స్టాండర్డ్ వెర్షన్‌లో కూడా ఉండవచ్చు.
బ్లైండ్ స్పాట్ వార్నింగ్ సైన్ : స్పై వీడియోలో కారు ఎడమ వైపున ఉన్న అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ పై బ్లైండ్ స్పాట్ వార్నింగ్ ఇండికేషన్ కూడా కనిపించింది. ఇది కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్‌లో లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉండవచ్చని సూచిస్తుంది. ప్రస్తుత వెన్యూ మోడల్‌లో లెవెల్-1 ADAS ఇప్పటికే ఉంది.
డ్యూయల్ స్క్రీన్ సెటప్ : వీడియోలో కారు ఇంటీరియర్ చూపించనప్పటికీ, కొత్త క్రెటాలో ఉన్నట్లుగా డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఈ వెన్యూ ఎన్ లైన్‌లో కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ డ్యూయల్ స్క్రీన్‌లు సెకండ్ జనరేషన్ వెన్యూలో కూడా ఉండవచ్చు.
ఇంజిన్, ధర:
ఇంజిన్ గురించి కంపెనీ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే, మీడియా నివేదికల ప్రకారం, హ్యుందాయ్ కొత్త జనరేషన్ మోడల్‌లో కూడా ప్రస్తుత వెన్యూ ఎన్ లైన్‌లో ఉన్న 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ధర ప్రస్తుత మోడల్ (రూ. 11.11 లక్షల నుండి రూ. 12.81 లక్షలు, ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఇది టాటా నెక్సాన్, కియా సోనెట్, మారుతి బ్రెజా, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, రెనో కైగర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. స్పోర్టీ లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో ఈ కొత్త వెన్యూ ఎన్ లైన్ మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు.