Hyundai Creta N: బ్లాక్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్.. మరింత పవర్‌ఫుల్‌గా రాబోతున్న కొత్త క్రెటా ఎన్ లైన్
| కొత్త క్రెటా ఎన్ లైన్
Hyundai Creta N: హ్యుందాయ్ కంపెనీ తమ పాపులర్ ఎస్‌యూవీ క్రెటా కొత్త తరం మోడల్‌పై వేగంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా స్పోర్టీ వెర్షన్ Creta N Line తొలిసారిగా టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కింది. దక్షిణ కొరియా రోడ్లపై ఈ వాహనాన్ని పరీక్షిస్తుండగా ఫోటోగ్రాఫర్లు బంధించారు. కారుపై పూర్తిగా కవర్ ఉన్నప్పటికీ, కొన్ని కీలక డిజైన్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. SX3 అనే కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న ఈ కొత్త క్రెటా ఎన్ లైన్ 2027లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే లాంచ్ తేదీ, ఇంజిన్, ఇతర వివరాలపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
మరింత స్పోర్టీగా కొత్త Creta N Line డిజైన్
టెస్టింగ్ సమయంలో కనిపించిన కొత్త క్రెటా ఎన్ లైన్ సాధారణ మోడల్ కంటే మరింత దూకుడుగా, స్పోర్టీగా ఉంది. ఇందులో నల్లని అల్లాయ్ వీల్స్ (వీటి మధ్యలో N బ్యాడ్జ్ ఉంది), సైడ్ స్కర్ట్‌లు, రూఫ్ స్పాయిలర్, వెనుక భాగంలో డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్‌లు గమనించవచ్చు. ముందు, వెనుక బంపర్లను కొత్త డిజైన్‌లో తీర్చిదిద్దినప్పటికీ ప్రస్తుతం కవర్‌తో కప్పి ఉంచారు. కొత్త క్రెటా లుక్ గతంతో పోలిస్తే కాస్త నిటారుగా, బాక్సీ తరహాలో ఉండబోతోంది. స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, పెద్ద గ్రిల్ వంటి అంశాలు ఇందులో ప్రత్యేకంగా నిలుస్తాయి.
క్యాబిన్‌లో కొత్త టెక్నాలజీ.. స్పోర్టీ టచ్
కొత్త క్రెటా ఎన్ లైన్ ఇంటీరియర్ వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ సాధారణ కొత్త క్రెటా తరహాలోనే ఆధునిక డ్యాష్‌బోర్డ్ ఉండొచ్చని అంచనా. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్, సన్నని డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హ్యుందాయ్ ప్లియోస్ కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. గేర్ షిఫ్టర్‌ను సెంటర్ కన్సోల్ నుంచి స్టీరింగ్ వద్దకు మార్చడం వల్ల ముందు సీట్ల వద్ద మరింత ఖాళీ స్థలం లభిస్తుంది. ఎన్ లైన్ మోడల్ కావడంతో క్యాబిన్ మొత్తం నలుపు రంగులో, అక్కడక్కడా ఎరుపు రంగు హంగులు, స్పోర్టీ సీట్లు, N బ్యాడ్జింగ్, ప్రత్యేక స్టీరింగ్ వీల్ ఉంటాయి.
ఇంజిన్ ఆప్షన్లలో మార్పులు ఉంటాయా?
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రెటా ఎన్ లైన్‌లో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 158 bhp శక్తిని, 253 Nm టార్క్‌ను అందిస్తుంది. దీనికి 7-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. కొత్త ఎన్ లైన్‌లోనూ ఇదే ఇంజిన్ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు కొత్త జనరేషన్ క్రెటాలో పెట్రోల్, డీజిల్‌తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ కూడా వస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్ లైన్ వెర్షన్‌లో హైబ్రిడ్ ఇంజిన్ ఇస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు.
ఎప్పుడు విడుదలవుతుంది?
కొత్త తరం క్రెటా ఎస్‌యూవీ 2027 ద్వితీయార్థంలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి ఎన్ లైన్ వేరియంట్ మార్కెట్లోకి రావచ్చు. ప్రస్తుతం విక్రయిస్తున్న క్రెటా ఎన్ లైన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.19.03 లక్షలుగా ఉంది. కొత్త మోడల్‌తో స్పోర్టీ ఎస్‌యూవీ ప్రియులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.