Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త రికార్డు.. దేశ చరిత్రలో తొలిసారి 10 లక్షల బైక్ ల విక్రయం
దేశ చరిత్రలో తొలిసారి 10 లక్షల బైక్ ల విక్రయం
Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలో 2025 ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. బుల్లెట్, క్లాసిక్, హంటర్ వంటి మోడళ్ల క్రేజ్ ఇండియాలో ఏ స్థాయిలో ఉందో తాజా అమ్మకాల లెక్కలే చెబుతున్నాయి. దేశీయ మార్కెట్లో కంపెనీ తొలిసారిగా ఏటా 10 లక్షల యూనిట్ల మార్కును దాటి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలు రాయల్ ఎన్‌ఫీల్డ్ దూకుడుకు మరింత ఇంధనాన్ని అందించాయి.
మిడ్-సైజ్ క్రూజర్ మోటార్‌సైకిల్ విభాగంలో రారాజుగా వెలుగొందుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్, 2025 క్యాలెండర్ ఇయర్‌లో 10,71,809 యూనిట్లను విక్రయించి మెగా రికార్డును నెలకొల్పింది. కంపెనీ చరిత్రలో దేశీయ మార్కెట్లో 10 లక్షల అమ్మకాల మైలురాయిని చేరడం ఇదే మొదటిసారి. 2024లో ఉన్న 8.57 లక్షల అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 25 శాతం పెరుగుదల. కేవలం ఇండియాలోనే కాదు, విదేశాలకు కూడా ఈ బైక్ ల ఎగుమతులు 36 శాతం పెరగడం విశేషం. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు వరుసగా మూడు నెలల పాటు నెలకు లక్షకు పైగా బైక్ లు షోరూమ్‌ల నుండి రోడ్ల మీదకు వచ్చాయి.
జీఎస్టీ 2.0 తో భారీగా తగ్గిన ధరలు
ఈ రికార్డు అమ్మకాలకు ప్రధాన కారణం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలు. దీని కింద 350సీసీ వరకు సామర్థ్యం ఉన్న బైక్ లపై పన్నును 28% నుంచి 18%కి తగ్గించారు. ఈ లబ్ధిని నేరుగా కస్టమర్లకు అందించిన తొలి కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్. దీనివల్ల బుల్లెట్, క్లాసిక్, హంటర్, మీటియోర్ 350 మోడళ్ల ధరలు సుమారు రూ.22,000 వరకు తగ్గాయి. ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి, యువతను షోరూమ్‌ల వైపు భారీగా ఆకర్షించింది.
మార్కెట్లో ఉన్న మోడళ్లు ఇవే
ప్రస్తుతం కంపెనీ దగ్గర 350సీసీ నుంచి 650సీసీ వరకు మొత్తం 14 రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.
350cc సెగ్మెంట్: బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, మీటియోర్ 350, గోవాన్ క్లాసిక్ 350.
440cc - 450cc సెగ్మెంట్: స్క్రామ్ 440, హిమాలయన్ 450, గెరిల్లా 450.
650cc సెగ్మెంట్: ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మీటియోర్ 650, షాట్‌గన్ 650, క్లాసిక్ 650, బేర్ 650.
గత 13 ఏళ్ల ప్రయాణం
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2018లో తొలిసారిగా 8 లక్షల మార్కును దాటింది. ఆ తర్వాత కోవిడ్ సమయంలో అమ్మకాలు 5.38 లక్షలకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత వరుసగా కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. 2025 అక్టోబర్ నెలలో ఏకంగా 1,16,844 యూనిట్లను విక్రయించి తన ఆల్‌టైమ్ మంత్లీ రికార్డును సృష్టించింది. కేవలం అమ్మకాలే కాదు, అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో బైక్ ల బుకింగ్ సదుపాయాన్ని కూడా కల్పించి కస్టమర్లకు మరింత చేరువయ్యింది.