Royal Enfield : బుల్లెట్ బైక్ లే కావాలంటున్న జనం.. జులై నెలలో రికార్డు బ్రేకింగ్ సేల్స్
జులై నెలలో రికార్డు బ్రేకింగ్ సేల్స్;
Royal Enfield : భారతదేశంలో బైక్ లవర్స్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఒక ఎమోషన్. తమ స్టైల్ మరియు పెర్ఫార్మెన్స్‌తో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంటుంది. జూలై నెలలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అద్భుతమైన అమ్మకాలతో దూసుకుపోయింది. గత నెలలో మొత్తం 88,045 బైక్‌లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెల (జూలై 2024)తో పోలిస్తే ఏకంగా 31% వృద్ధిని సూచిస్తుంది. దేశీయంగా 76,254 బైక్‌లు అమ్ముడుపోగా, విదేశాలకు 11,791 బైక్‌లను ఎగుమతి చేశారు.
ఇది గతేడాదితో పోలిస్తే 25% వృద్ధి. ఎగుమతులలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అద్భుతమైన పనితీరు చూపింది. గత సంవత్సరం 6,057 యూనిట్లు ఎగుమతి చేస్తే, ఈ సంవత్సరం 11,791 యూనిట్లు ఎగుమతి అయ్యాయి, అంటే దాదాపు రెట్టింపు వృద్ధి. ఆర్థిక సంవత్సరం 2025లో ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కాలంలో దేశీయంగా మొత్తం 3,05,033 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15% ఎక్కువ. అదే సమయంలో అంతర్జాతీయ అమ్మకాలు ఏకంగా 72% వృద్ధితో 28,278 నుంచి 48,540 యూనిట్లకు పెరిగాయి. మొత్తం మీద, ఈ నాలుగు నెలల్లో 3,53,573 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది గత సంవత్సరం కంటే 20% ఎక్కువ.
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల అమ్మకాలు బాగా పెరిగాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో దేశీయంగా 3,05,033 బైక్‌లు అమ్ముడుపోయాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో అమ్ముడుపోయిన బైక్‌ల కంటే 15% ఎక్కువ. విదేశాలకు ఎగుమతులు అయితే ఏకంగా 72% పెరిగాయి.
త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మరిన్ని కొత్త బైక్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా, 450 సీసీ ఇంజిన్‌తో కూడిన కొత్త మోడల్స్ వస్తున్నాయి. అంతేకాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 650 సీసీ, 750 సీసీ బైక్‌లను కూడా తయారుచేస్తుంది. 2026లో గురిల్లా 450 మోడల్‌లో కేఫ్ రేసర్ వెర్షన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ట్రయంఫ్ కంపెనీ తీసుకొచ్చే త్రక్స్‌టన్ 400 మోడల్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాంటినెంటల్ GT-R పేరుతో కొత్త 750 సీసీ బైక్ కూడా మార్కెట్లోకి వస్తుందని సమాచారం.