Upcoming SUVs : మారుతి, హ్యుందాయ్‌లకు చెమటలు పట్టించేలా స్కోడా, ఫోక్స్ వ్యాగన్ నుంచి 4 సరికొత్త ఎస్‌యూవీలు

4 సరికొత్త ఎస్‌యూవీలు

Update: 2026-06-29 14:30 GMT

Upcoming SUVs : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించడానికి ప్రముఖ గ్లోబల్ కార్ల తయారీ సంస్థలు స్కోడా, ఫోక్స్ వ్యాగన్ సిద్ధమయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో కేవలం పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజన్ కార్లను మాత్రమే విక్రయిస్తున్న ఈ రెండు బ్రాండ్లు, రాబోయే రోజుల్లో మార్కెట్ లీడర్లు అయిన మారుతి సుజుకి, హ్యుందాయ్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని పక్కా ప్లాన్ వేశాయి. ఇందులో భాగంగానే రాబోయే కొద్ది నెలల్లోనే చిన్న సబ్-4 మీటర్ ఎస్‌యూవీల నుంచి భారీ పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీల వరకు ఏకంగా నాలుగు సరికొత్త టర్బో-పెట్రోల్ మోడళ్లను మార్కెట్లోకి దించడానికి రంగం సిద్ధం చేశాయి.

స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్

భారత్‌లో స్కోడా కంపెనీకి అత్యధిక అమ్మకాలను అందిస్తూ దూసుకుపోతున్న కైలాక్ ఎస్‌యూవీలో ఇప్పుడు మరింత స్టైలిష్ వెర్షన్ రాబోతోంది. అదే స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్. ఈ సరికొత్త వేరియంట్ రెగ్యులర్ మోడల్ కంటే చాలా స్పోర్టీ లుక్‌తో, ప్రత్యేకమైన కాస్మెటిక్ మార్పులతో మార్కెట్లోకి రానుంది. ఇది పాత MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పైనే ఆధారపడి నిర్మితమైనప్పటికీ, ఇందులో 113 హార్స్‌పవర్, 178 Nm టార్క్‌ను ఇచ్చే నమ్మకమైన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే, ఇందులో పాత ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో సరికొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది కారు పర్ఫార్మెన్స్‌ను, మైలేజ్ సామర్థ్యాన్ని భారీగా పెంచనుంది.

స్కోడా కోడియాక్ RS

స్కోడా నుండి రాబోతున్న అత్యంత ఖరీదైన, పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కోడియాక్ ఆర్‌ఎస్ కోసం భారత కార్ లవర్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ కారును విదేశాల నుండి పూర్తిగా తయారు చేసిన రూపంలో ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నారు. మొదటి బ్యాచ్ కింద కేవలం 50 కార్లను మాత్రమే కంపెనీ కేటాయించగా, బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 6 నిమిషాల లోపే అన్ని కార్లు అమ్ముడైపోయి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ కారులో అమర్చిన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఏకంగా 263 హార్స్‌పవర్, 400 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది నార్మల్ మోడల్ కంటే 60 హార్స్‌పవర్ ఎక్కువ కావడం విశేషం.

ఈ కోడియాక్ RS ఎస్‌యూవీలో 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను కూడా అందించారు. ప్రయాణం చాలా స్మూత్‌గా సాగడానికి డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (DCC), ప్రోగ్రెసివ్ స్టీరింగ్, వేగాన్ని కంట్రోల్ చేయడానికి అప్‌గ్రేడ్ చేసిన బ్రేకింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ కారు లుక్ విషయానికి వస్తే 20-ఇంచుల భారీ వీల్స్, బ్లాక్ ట్రిమ్స్, సరికొత్త బంపర్లతో పాటు లోపల లగ్జరీ బ్లాక్ క్యాబిన్, స్పోర్ట్స్ సీట్లను అందించారు. ఈ కారు కేవలం 6.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 231 కిలోమీటర్లుగా నమోదైంది.

ఫోక్స్ వ్యాగన్ టైరాన్

ఫోక్స్ వ్యాగన్ కంపెనీ తన పాపులర్ ఎస్‌యూవీ టైరాన్ స్టాండర్డ్ వెర్షన్‌ను రాబోయే నెలల్లో ఇండియాలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ కారు కేవలం టాప్-ఎండ్ R-Line వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా నార్మల్ వెర్షన్‌ను తెస్తున్నారు. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ ఆర్-లైన్ కంటే కాస్త సింపుల్‌గా ఉంటుంది. కొన్ని లగ్జరీ ఫీచర్లు ఇందులో తగ్గనున్నాయి. అయితే ఇంజన్ పరంగా ఎలాంటి మార్పు లేకుండా అదే 2.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు, కాకపోతే పవర్, టార్క్ అవుట్‌పుట్ కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఫోక్స్ వ్యాగన్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ

మరోవైపు ఫోక్స్ వ్యాగన్ సంస్థ భారతీయ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ ఒక సరికొత్త సబ్-4 మీటర్ చిన్న ఎస్‌యూవీపై రాత్రింబవళ్లు పనిచేస్తోంది. ఇది మార్కెట్లోకి వచ్చాక నేరుగా స్కోడా కైలాక్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కారు ప్లాట్‌ఫారమ్, ఇంజన్‌ను స్కోడా కైలాక్ నుండినే షేర్ చేసుకోనున్నారు. ఇందులో కూడా 113 హార్స్‌పవర్, 178 Nm టార్క్‌ను ఇచ్చే 1.0-లీటర్ TSI త్రీ-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అమర్చనున్నారు. దీనికి తోడు 6-స్పీడ్ మాన్యువల్, 8-స్పీడ్ టాప్-ఎండ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను అందించబోతున్నారు.

Tags:    

Similar News