Tata Motors : టాటా మోటార్స్ కీలక ప్రకటన.. సౌత్ ఆఫ్రికాలోకి భారతీయ కార్లు
సౌత్ ఆఫ్రికాలోకి భారతీయ కార్లు
Tata Motors : టాటా మోటార్స్ దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి సౌతాఫ్రికా కార్ల మార్కెట్లో ప్రవేశించబోతోంది. ఈ నెల 19న భారతీయ కార్ల కంపెనీ సౌతాఫ్రికా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. భారత్‌లో తయారైన తమ పాపులర్ మోడల్స్ అయిన టియాగో, పంచ్, కర్వ్, హారియర్‌లను అక్కడ విడుదల చేయనుంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో బడ్జెట్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో, టాటా మోటార్స్ ఈ కార్లను భారతదేశం నుండి ఎగుమతి చేస్తుంది.
సౌతాఫ్రికాలో తమ కార్ల అమ్మకాలు, పంపిణీ కోసం టాటా మోటార్స్ ప్రముఖ సంస్థ మోటస్ గ్రూప్‌తో చేతులు కలిపింది. తమ కొత్త కార్ల గురించిన టీజర్లను కంపెనీ సోషల్ మీడియాలో విడుదల చేస్తోంది. తొలి దశలో రెండు మోడళ్లను విడుదల చేయనుంది. అయితే, ఈ కార్లు దాదాపుగా భారతీయ మోడల్స్ లాగే ఉంటాయని, మార్కెట్, అక్కడి నిబంధనలకు అనుగుణంగా కొన్ని మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ కార్లలో టియాగో, పంచ్, కర్వ్ కేవలం పెట్రోల్ ఇంజిన్‌తోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి టాటా హారియర్ ఒక్కటే కంపెనీ నుండి విడుదలయ్యే డీజిల్ కారు. ఈ సంవత్సరం చివరి నాటికి టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. సౌతాఫ్రికాలో డిమాండ్‌ను బట్టి, భవిష్యత్తులో అల్ట్రోజ్, సఫారి వంటి మోడళ్లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. టాటా మోటార్స్ ప్యాసెంజర్ కార్ల విభాగంలో తిరిగి ప్రవేశిస్తున్నప్పటికీ, సౌతాఫ్రికాలో టాటా ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో ఇప్పటికే వాణిజ్య వాహనాలను విక్రయిస్తోంది.
సౌతాఫ్రికా ఒక పెద్ద రైట్-హ్యాండ్ డ్రైవ్ కార్ల మార్కెట్. భారతదేశ ఆటోమొబైల్ రంగం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే సుజుకి, హ్యుందాయ్, టయోటా, మహీంద్రా వంటి అనేక భారతీయ, అంతర్జాతీయ కంపెనీలు అక్కడ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఆఫ్రికాలో అతిపెద్ద ఆటో మార్కెట్లలో ఇది ఒకటి. అక్కడ టాటా కార్లు ఇప్పటికే ఉన్న అనేక మేడ్-ఇన్-ఇండియా మోడళ్లతో పోటీ పడనున్నాయి.