Tata Nexon : పేరు మారింది గురూ.. కొత్త అవతారంలో టాటా నెక్సాన్ 'టాటా ఆస్ప్రే'గా ఎంట్రీ

టాటా నెక్సాన్ 'టాటా ఆస్ప్రే'గా ఎంట్రీ

Update: 2026-07-20 11:55 GMT

Tata Nexon : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‎ను ఇప్పుడు సౌతాఫ్రికా మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమైంది. అయితే అక్కడ ఈ పాపులర్ ఎస్‌యూవీని ఒక ప్రత్యేకమైన కొత్త పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నారు. సౌతాఫ్రికా మార్కెట్లో టాటా నెక్సాన్'టాటా ఆస్ప్రే'అనే పేరుతో లాంచ్ కానుంది. ఈ ఎస్‌యూవీని 2026 మూడో త్రైమాసికం (Q3 2026) ఆఖరు నాటికి ఆఫ్రికన్ రోడ్లపైకి తేనున్నట్లు టాటా మోటార్స్ అధికారికంగా వెల్లడించింది. ఆస్ప్రే అంటే వేగంగా, శక్తివంతంగా వేటాడే ఒక ప్రత్యేకమైన పక్షి అని అర్థం. ఈ కారులోని అడ్వెంచర్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, ఏ రకమైన రోడ్డుపైనైనా సునాయాసంగా వెళ్లే సామర్థ్యానికి ఈ పేరు సరిగ్గా సరిపోతుండటంతో ఆఫ్రికన్ కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ నామకరణం చేశారు.

10 లక్షల మంది నమ్మకం

గ్లోబల్ మార్కెట్లో టాటా నెక్సాన్ మోడల్‌కు ఇప్పటికే అత్యంత ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 10 లక్షల కంటే ఎక్కువ మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేశారు. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో నెక్సాన్ నిరంతరం అగ్రస్థానంలో ఉంటోంది. సేఫ్టీ విషయంలో తిరుగులేని రికార్డు ఉన్న ఈ కారు, భారతదేశంలో గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మొట్టమొదటి ఆటోమొబైల్ మోడల్‌గా నిలిచింది. దీంతోపాటు భారత్ NCAP లోనూ ఇది 5-స్టార్ రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది.

ఎగుమతుల్లో ఏకంగా 45 శాతం వృద్ధి

టాటా మోటార్స్ అంతర్జాతీయంగా తమ విక్రయాలను గణనీయంగా పెంచుకుంటోంది. ఇటీవలి గణాంకాల ప్రకారం.. జూన్ 2026 నాటికి కంపెనీ విదేశాలకు 700 ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 45 శాతం అధికం. సౌతాఫ్రికా వంటి కొత్త మార్కెట్లలో టాటా ఆస్ప్రే లాంచ్ అవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో కంపెనీ ఎగుమతులు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు.

వేటాడే పక్షి పేరుతో టాటా ఆస్ప్రే

పేరు మార్చడం మినహా, సౌతాఫ్రికాలో విడుదలయ్యే టాటా ఆస్ప్రే కారు డిజైన్, ఇంజన్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవు. భారత్‌లో విక్రయిస్తున్న నెక్సాన్ మోడల్‌లో ఉన్న ప్రీమియం ఇంటీరియర్స్, అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వినూత్న టెక్నాలజీ, బెస్ట్-ఇన్-క్లాస్ సేఫ్టీ ఫీచర్లు ఆస్ప్రేలోనూ కొనసాగుతాయి. సిటీ డ్రైవింగ్‌తో పాటు లాంగ్ డ్రైవ్‌లు, అడ్వెంచర్ ట్రిప్‌లకు ఇది బెస్ట్ ఎస్‌యూవీగా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News