Tata Punch : టాటా పంచ్ జోరు.. నాలుగేళ్లలోనే 7 లక్షల కార్ల విక్రయం.. సరికొత్త రికార్డు

సరికొత్త రికార్డు

Update: 2026-03-24 09:28 GMT

Tata Punch : భారతీయ రోడ్లపై ప్రస్తుతం చిన్న ఏనుగులా ఒక కారు సంచలనం సృష్టిస్తోంది. అదే టాటా పంచ్. 2021లో అడుగుపెట్టిన ఈ మైక్రో ఎస్‌యూవీ, అతి తక్కువ కాలంలోనే ఊహించని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. సేఫ్టీలో బెస్ట్, లుక్‌లో పక్కా ఎస్‌యూవీ, ధరలో అందరికీ అందుబాటులో ఉండటంతో.. ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. అయితే ఇప్పుడు పంచ్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి దిగ్గజాలు తమ కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. టాటా పంచ్ విడుదలైన 4 ఏళ్లలోనే 7 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును దాటి, దేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. 2024 సంవత్సరంలో భారతీయ మార్కెట్లోనే అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా ఇది రికార్డు సృష్టించింది. నెలకు సగటున 18,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడవుతున్నాయంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ ఇలా మూడు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉండటం దీని విజయానికి ప్రధాన కారణం. ముఖ్యంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలకు ఇది మొదటి ప్రాధాన్యతగా మారింది.

పంచ్ ఈవీ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ ఒక సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇటీవల భారతీయ రోడ్లపై ఈ కారు టెస్టింగ్ దశలో కనిపించింది. ఇది చూడటానికి బాక్సీ డిజైన్‌తో, పక్కా ఎస్‌యూవీలా ఉంటుంది. ముందు, వెనుక భాగంలో పిక్సెల్ డిజైన్ కలిగిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, బ్లాక్ రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. లోపల 360-డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో ఈ కారు మార్కెట్లోకి రానుంది. ఇది ప్రధానంగా పంచ్ ఈవీకి నేరుగా పోటీ ఇవ్వనుంది.

దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా మైక్రో ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెట్టనుంది. Y43 అనే కోడ్ నేమ్‌తో పిలవబడే ఈ కారు, టాటా పంచ్‌కు గట్టి పోటీనిచ్చేలా రూపొందుతోంది. ఇందులో 1.2 లీటర్ లేదా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మారుతి తన పవర్‌ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఈ కారులో కూడా ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఇదే కాకుండా ఈ మోడల్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా లాంచ్ చేసే యోచనలో కంపెనీ ఉంది. అంటే కస్టమర్లకు పెట్రోల్, హైబ్రిడ్, ఈవీ ఆప్షన్లు మారుతి నుంచి కూడా లభించనున్నాయి.

భారతీయ కస్టమర్లు ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే చిన్న ఎస్‌యూవీల వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే హ్యుందాయ్ తన ఎక్స్టర్ మోడల్‌ను మరింత అప్‌డేట్ చేయడమే కాకుండా కొత్త ఈవీలను తెస్తోంది. 2026 చివరి నాటికి లేదా 2027 నాటికి మారుతి, హ్యుందాయ్ నుంచి కొత్త మోడల్స్ రావడం ఖాయం. అప్పటివరకు తన అమ్మకాలను నిలబెట్టుకోవడానికి టాటా మోటార్స్ కూడా పంచ్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు, వేరియంట్లను జోడించే అవకాశం ఉంది. ఈ పోటీ వల్ల అంతిమంగా కస్టమర్లకు తక్కువ ధరలో మంచి ఆప్షన్లు లభిస్తాయి.

Tags:    

Similar News