Top Mileage Cars : దీపావళికి కొత్త కారు కొనాలనుకుంటున్నారా? రూ.10 లక్షలలోపు అత్యధిక మైలేజీ ఇచ్చే 7 కార్లు
రూ.10 లక్షలలోపు అత్యధిక మైలేజీ ఇచ్చే 7 కార్లు
Top Mileage Cars : దీపావళి, పండుగల సీజన్ దగ్గర పడుతుండటంతో చాలా మంది కొత్త కారు కొనడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో కారు మైలేజ్ అనేది అత్యంత ముఖ్యమైన అవసరంగా మారింది. మీ బడ్జెట్ రూ.10 లక్షల లోపు ఉండి, మంచి మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్నట్లయితే, భారత మార్కెట్‌లో కంఫర్ట్, ఫీచర్లలో ఏమాత్రం రాజీ పడకుండా అద్భుతమైన మైలేజ్ ఇచ్చే కార్లు చాలా అందుబాటులో ఉన్నాయి.
చిన్న హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి సెలెరియో చాలా ప్రజాదరణ పొందింది. దీని LXi MT వేరియంట్ ధర రూ.4,69,900 నుంచి ప్రారంభమవుతుంది. సెలెరియో పెట్రోల్ వేరియంట్‌లో 26.6 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది, కాగా CNG వేరియంట్ 35.12 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. నిజ జీవితంలో ఇది పెట్రోల్‌లో 22-24 కి.మీ/లీ, CNGలో 30-32 కి.మీ/కేజీ వరకు మైలేజ్ ఇస్తుంది.
అలాగే, పట్టణ ప్రాంతాలలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో వాగన్ఆర్ ఒకటి. దీని LXi MT వేరియంట్ ధర రూ.4,98,900 నుంచి మొదలవుతుంది. ఈ కారు 26.1 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది. పెద్ద ఇంటీరియర్ స్పేస్, కాంపాక్ట్ డిజైన్ దీన్ని సిటీ డ్రైవింగ్‌కు పర్ఫెక్ట్‌గా మారుస్తాయి.
మీరు మొదటిసారి కారు కొనుగోలు చేస్తూ, తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్ కావాలనుకుంటే, మారుతి సుజుకి ఆల్టో K10 అద్భుతమైన ఆప్షన్. దీని Std (O) వేరియంట్ రూ.3,69,900 నుంచి ప్రారంభమవుతుంది. 24.8 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది. దీని చిన్న సైజు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు రోజువారీ ప్రయాణానికి దీన్ని ఫేవరెట్‌గా నిలుపుతాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్ కారు స్టైల్, కంఫర్ట్, మైలేజ్ కలయికగా ఉంటుంది. దీని VXi వేరియంట్ రూ.7,70,900 నుంచి మొదలవుతుంది. 23.2 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది. కొంత పెద్ద కారు కోరుకునే వారికి, ఇంధన పొదుపు కూడా ముఖ్యమనుకునే వారికి ఇది సరైనది.
మీరు సెడాన్ కారు కోసం చూస్తున్నట్లయితే మారుతి సుజుకి డిజైర్ బెస్ట్ ఛాయిస్ దీని LXi MT వేరియంట్ ధర రూ.6,25,600 నుంచి ప్రారంభమవుతుంది. 24.1 కి.మీ/లీ వరకు మైలేజ్ ఇస్తుంది. విశాలమైన క్యాబిన్ సిటీతో పాటు హైవే ప్రయాణాలకు కూడా సౌకర్యంగా ఉంటుంది.
చిన్న ఎస్‌యూవీ కోసం చూస్తున్న వారికి హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక మంచి ఆప్షన్. దీని బేస్ వేరియంట్ రూ.5,68,033 నుంచి మొదలవుతుంది. 19.0 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది. దీని లేటెస్ట్ లుక్, ఎత్తైన సీటింగ్ పొజిషన్ యువతను ఆకర్షిస్తున్నాయి.
టాటా పంచ్ కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉంది. దీని XE వేరియంట్ ధర సుమారు రూ.6,00,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 18.0 కి.మీ/లీ వరకు మైలేజ్ ఇస్తుంది. దీని బలమైన లుక్, సరసమైన ధర కుటుంబాలకు, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటాయి.