Toyota Ebella vs Maruti e-Vitara: టయోటా ఎబెల్లా వర్సెస్ మారుతి ఈ-విటారా..ఒకేలా ఉన్నా తేడాలు గమనించారా?
ఒకేలా ఉన్నా తేడాలు గమనించారా?
Toyota Ebella vs Maruti e-Vitara: టయోటా కంపెనీ భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న హైరైడర్ మోడల్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్. టయోటా మరియు మారుతి సుజుకి భాగస్వామ్యంలో తయారైన ఈ కారు, చూడటానికి మారుతి ఈ-విటారాలాగే ఉన్నా, కొన్ని కీలక విషయాల్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారు బుకింగ్‌లు కూడా మొదలైపోయాయి. మారుతి ఈ-విటారాకు, టయోటా ఎబెల్లాకు మధ్య ఉన్న ఆ రెండు ప్రధాన తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా, మారుతి సుజుకి ఈ-విటారా రెండు కూడా ఒకే ప్లాట్‌ఫామ్ (27RW) పై తయారయ్యాయి. అయినప్పటికీ టయోటా తన బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి ఎబెల్లా డిజైన్‌లో కీలక మార్పులు చేసింది. ఇందులో మొదటిది డిజైన్ మరియు లుక్. మారుతి ఈ-విటారాలో Y ఆకారపు ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్ ఉంటే, టయోటా ఎబెల్లాలో మరింత క్లాసీగా ఉండే సెగ్మెంటెడ్ డాట్ ప్యాటర్న్ డీఆర్‌ఎల్స్‌ను అందించారు. అలాగే టయోటా సిగ్నేచర్ హామర్‌హెడ్ గ్రిల్ ఈ కారుకు ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తుంది. వెనుక భాగంలో కూడా కనెక్టెడ్ టెయిల్ లైట్స్ డిజైన్ మారుతి కారు కంటే భిన్నంగా, మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
రెండో ప్రధాన తేడా కొలతలు. చూడటానికి రెండు కార్లు ఒకే సైజులో ఉన్నట్లు అనిపించినా, టయోటా ఎబెల్లా పొడవు మారుతి ఈ-విటారా కంటే 10 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. ఎబెల్లా పొడవు 4,285 మిమీ కాగా, ఈ-విటారా పొడవు 4,275 మిమీ మాత్రమే. ఈ చిన్న తేడా వల్ల కారుకు రోడ్డుపై మరింత స్ట్రాంగ్ లుక్ రావడమే కాకుండా, లోపల బూట్ స్పేస్ విషయంలో కూడా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే, రెండింటి వీల్‌బేస్ మాత్రం 2,700 మిమీగా సమానంగా ఉంది, దీనివల్ల క్యాబిన్ లోపల లెగ్ స్పేస్ మాత్రం ఒకేలా ఉంటుంది.
సాంకేతిక వివరాల్లోకి వెళ్తే.. ఎబెల్లా కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. ఒకటి 49 kWh బ్యాటరీ (440 కి.మీ రేంజ్), రెండోది 61 kWh బ్యాటరీ (543 కి.మీ రేంజ్). ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS భద్రత, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్ల వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. టయోటా ఈ కారుపై 8 ఏళ్ల బ్యాటరీ వారంటీని, 60 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది. అంటే కారు కొన్న తర్వాత తిరిగి అమ్మాలనుకున్నా మీకు మంచి ధర లభిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ వంటి గట్టి పోటీదారుల మధ్య టయోటా ఎబెల్లా తన ప్రత్యేక డిజైన్, బ్రాండ్ నమ్మకంతో దూసుకుపోవడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 2026లో ఈ కారు అధికారిక ధరలను కంపెనీ ప్రకటించనుంది. ఇప్పటికే బుకింగ్స్ జోరుగా సాగుతుండటంతో, డెలివరీలు కూడా మార్చి లేదా ఏప్రిల్ నుండి మొదలయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టయోటా ఇస్తున్న ఈ పవర్ ఫుల్ పంచ్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.