Toyota : భారత ఆటో మార్కెట్‌లో టయోటా హంగామా.. వచ్చే 15 నెలల్లో 4 కొత్త పవర్‌ఫుల్ కార్లు

వచ్చే 15 నెలల్లో 4 కొత్త పవర్‌ఫుల్ కార్లు

Update: 2026-07-20 11:52 GMT

Toyota : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తమదైన మార్క్ వేసిన ప్రముఖ జపనీస్ బ్రాండ్ టయోటా కిర్లోస్కర్ మోటార్ రాబోయే 12 నుంచి 15 నెలల కాలవ్యవధిలో భారీ లాంచ్‌లకు ప్లాన్ చేస్తోంది. భారత వినియోగదారులను ఆకట్టుకోవడానికి టయోటా ఏకంగా 4 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనుంది. వీటిలో ఆల్ న్యూ ఫార్చ్యూనర్, 9వ తరం హిలక్స్, ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్, సరికొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ వంటి అడ్వాన్స్‌డ్ వాహనాలు ఉన్నాయి.

సరికొత్త డిజైన్‌తో 9త్ జనరేషన్ టయోటా హిలక్స్

టయోటా నుంచి త్వరలోనే రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక మోడల్ 9వ జనరేషన్ టయోటా హిలక్స్. ఈ లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ సైబర్ సుమో డిజైన్ లాంగ్వేజ్‌ ఆధారంగా షార్ప్, అగ్రెసివ్ లుక్‌తో రూపుదిద్దుకుంది. డ్రైవింగ్‌ను సులభతరం చేసేందుకు ఇందులో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అందించారు. అంతేకాకుండా ముందస్తు ప్రమాదాలను నివారించే ప్రి-కొలిజన్ సేఫ్టీ సిస్టమ్, లెవెల్-2 ఏడాస్ (ADAS) వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయి.

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఆల్ న్యూ ఫార్చ్యూనర్

హిలక్స్ డిజైన్ ఆధారంగానే థర్డ్ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్ ను సరికొత్త అవతారంలో తీసుకొస్తున్నారు. ఈ ఆల్-న్యూ ఫార్చ్యూనర్‌లో కస్టమర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించే అవకాశం ఉంది. మెరుగైన ఇంటీరియర్స్, 12.3 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 48V మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో ఈ లగ్జరీ ఎస్‌యూవీ మార్కెట్లో సరికొత్త హంగామా సృష్టించనుంది.

18 ఇంచుల అల్లాయ్ వీల్స్‌తో ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్

మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ను మరింత అకర్షణీయంగా మార్చేందుకు టయోటా దీని ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను సిద్ధం చేస్తోంది. నూతనంగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌లాంప్‌లు, మోడ్రన్ టెయిల్ లైట్స్, కొత్త బంపర్లు, నయా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రానుంది. ఇంటీరియర్‌లో కూడా కొత్త డిజిటల్ క్లస్టర్, పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, అప్‌గ్రేడెడ్ ఏడాస్ ఫీచర్లను అందిస్తున్నారు.

టయోటా నుంచి సంచలన ఎలక్ట్రిక్ ఎంపీవీ

ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి బలమైన పునాది వేయడానికి టయోటా తమ తొలి ఎలక్ట్రిక్ ఎంపీవీని అందుబాటులోకి తేవడానికి కసరత్తు చేస్తోంది. ఇది ఇన్నోవా క్రిస్టా కంటే కాస్త పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, ఎస్‌యూవీ తరహా బోల్డ్ డిజైన్‌తో రానుంది. టయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా / మారుతి ఇ-విటారా ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారవుతున్న ఈ ఈవీ, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుందని సమాచారం. ఇది కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.

Tags:    

Similar News