TVS Motor : ఎలక్ట్రిక్ వాహన రంగంలో టీవీఎస్ ప్రభంజనం..ఒక్క ఏడాదే 3 లక్షల స్కూటర్ల విక్రయం

ఒక్క ఏడాదే 3 లక్షల స్కూటర్ల విక్రయం

Update: 2026-03-19 09:39 GMT

TVS Motor : భారత టూ-వీలర్ మార్కెట్‌లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈ రేసులో అందరికంటే ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు తిరుగులేని రారాజుగా అవతరించింది. ఓలా, బజాజ్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి, ఈ ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 3 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి, దేశంలోనే నంబర్-1 ఈవీ కంపెనీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో టీవీఎస్ మోటార్ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 17 వరకు కంపెనీ ఏకంగా 3,09,984 ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు అందజేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 33 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2020లో ఈ రంగంలోకి ప్రవేశించిన టీవీఎస్, ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ తర్వాత ఒకే ఏడాదిలో 3 లక్షల మార్కును దాటిన రెండో కంపెనీగా నిలిచింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వరుసగా ఆరు నెలల పాటు నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుని తన సత్తా చాటింది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర దిగ్గజ కంపెనీలు టీవీఎస్ దరిదాపుల్లో కూడా లేవు. బజాజ్ ఆటో సుమారు 2.5 లక్షల ఈవీలను విక్రయించి రెండో స్థానంలో ఉండగా.. ఏథర్ ఎనర్జీ 2.15 లక్షలు, ఒకప్పుడు నంబర్-1 గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కేవలం 1.57 లక్షల యూనిట్లతో వెనుకబడిపోయాయి. గతేడాది 3.44 లక్షల విక్రయాలు జరిపిన ఓలా, ఈ ఏడాది ఏకంగా 57 శాతం పతనాన్ని చవిచూసింది. ఈ గణాంకాలు చూస్తుంటే కస్టమర్లు ఇప్పుడు బ్రాండ్ నమ్మకం, సర్వీస్ క్వాలిటీ ఉన్న టీవీఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది.

టీవీఎస్ విజయానికి ప్రధాన కారణం దాని ఐక్యూబ్ మోడల్. ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీగా పేరు తెచ్చుకుంది. దీనికి తోడు 2025 ఆగస్టులో లాంచ్ అయిన ఆర్బిటర్ స్కూటర్ కూడా యువతను బాగా ఆకట్టుకుంటోంది. మార్చి 12న కంపెనీ ప్రవేశపెట్టిన బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్(BaaS) మోడల్ ఈ రంగంలో గేమ్ ఛేంజర్ గా మారింది. ఈ ప్లాన్ ద్వారా బ్యాటరీ ధరను మినహాయించి స్కూటర్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల ఆర్బిటర్ వి1 (1.8 kWh) మోడల్ కేవలం రూ.49,999 (BaaSతో) లభిస్తుండటంతో సామాన్యులు కూడా ఈవీల వైపు మళ్లుతున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి టీవీఎస్ మొత్తం 3.27 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించి, మార్కెట్ లీడర్ గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటరీపై భయం పోగొట్టేందుకు కంపెనీ అందిస్తున్న సుదీర్ఘ వారంటీ, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ దీనికి బాగా కలిసి వస్తున్నాయి. ఈవీ మార్కెట్లో ఉన్న 140 కంపెనీల్లో కేవలం 5 కంపెనీలు మాత్రమే లక్ష మార్కును దాటగా, టీవీఎస్ మాత్రం 3 లక్షల మార్కును దాటి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది.

Tags:    

Similar News