Upcoming 7-Seater SUVs : టాటా నుండి మహీంద్రా వరకు.. 2026 నాటికి అదిరిపోయే ఎస్‌యూవీలు, ఎంపీవీలు

2026 నాటికి అదిరిపోయే ఎస్‌యూవీలు, ఎంపీవీలు

Update: 2025-10-17 13:09 GMT

Upcoming 7-Seater SUVs : విశాలమైన క్యాబిన్, మంచి బూట్ స్పేస్, ప్రీమియం ఫీచర్లు, రోడ్డుపై ఒక స్పెషల్ లుక్ ఉన్న కారు కోసం చూస్తున్నట్లయితే కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే 2026 నాటికి భారత మార్కెట్‌లోకి అనేక కొత్త త్రీ రో మోడల్స్ రాబోతున్నాయి. టాటా, మహీంద్రా, మారుతి, టయోటా వంటి ప్రముఖ కంపెనీలు తమ సరికొత్త కార్లతో సిద్ధమవుతున్నాయి.

టాటా మోటార్స్ రాబోయే నెలల్లో పెట్రోల్ బేస్డ్ సఫారిని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఎస్‌యూవీ సరికొత్త 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్, డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 170 బీహెచ్‌పి పవర్, 280 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2025 టాటా సఫారి పెట్రోల్ మోడల్, మూడు-రోల సీటింగ్‌తో పాటు ప్రస్తుతం ఉన్న సఫారిలోని అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.

మహీంద్రా 2026 ప్రారంభంలో రెండు కీలక మోడల్స్‌ను విడుదల చేయనుంది. ఒకటి XEV 7e.. ఇది XEV 9e కూపే ఎస్‌యూవీ 7-సీటర్ వెర్షన్. ఇది బ్రాండ్ మూడవ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అవుతుంది. XEV 9eలోని పవర్‌ట్రెయిన్‌లనే ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే 2026 మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్‎లో ప్రస్తుత ఇంజిన్ సెటప్‌ను కొనసాగిస్తూనే డిజైన్, ఫీచర్లలో స్వల్ప మార్పులు, అప్‌గ్రేడ్‌లు ఉంటాయని అంచనా

మారుతి సుజుకి భారతదేశం కోసం ఒక కొత్త ప్రీమియం ఎస్‌యూవీని తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. దీని పొడవు 4.5 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ మోడల్ గురించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఇది గ్రాండ్ విటారా త్రీ-రోల వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభించవచ్చు. భారత-జపనీస్ కార్ల తయారీ సంస్థ భారతదేశం కోసం ఒక సబ్‌కాంపాక్ట్ ఎంపీవీ పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఇది జపాన్-స్పెక్ సుజుకి స్పేషియా ఆధారంగా రూపొందించబడుతుంది.

టయోటా కిర్లోస్కర్ మోటార్ 2026లో కొత్త జనరేషన్ ఫార్చ్యూనర్‌ను ఇంట్రడ్యూస్ చేయనుంది. ఈ ఎస్‌యూవీ మెరుగైన స్టైలింగ్, ఏడిఏఎస్‌ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉండవచ్చు. అలాగే, 2026లో రాబోయే మారుతి త్రీ-రో ప్రీమియం ఎస్‌యూవీ రీ-బ్యాడ్జ్‌డ్ వేరియంట్‌ను కూడా జపనీస్ వాహన తయారీ సంస్థ విడుదల చేసే అవకాశం ఉంది.

2025 భారత మొబిలిటీ షోలో ప్రదర్శించబడిన ఎంజీ మజెస్టర్, వాస్తవానికి అప్‌డేటెడ్ గ్లోస్టర్ ఎస్‌యూవీ ప్రీమియం వేరియంట్. దీని లాంచ్ తేదీ గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ ఇది 2026 ప్రారంభంలో వస్తుందని అంచనా.

నిస్సాన్ ఇండియా అప్‌డేటెడ్ రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా ఒక కొత్త సబ్‌కాంపాక్ట్ ఎంపీవీని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మోడల్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్, ఫీచర్లు, ఇంజిన్‌ను పంచుకుంటుంది. అయితే దీని డిజైన్ నిస్సాన్ మాగ్నైట్ నుండి ఇన్ స్పైర్ అయింది.

Tags:    

Similar News