VinFast Limo Green : 30 నిమిషాల్లోనే 70% ఛార్జ్.. కియా కారెన్స్‌కు షాక్ ఇవ్వనున్న కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు
కియా కారెన్స్‌కు షాక్ ఇవ్వనున్న కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు
VinFast Limo Green : వినూత్న ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే డిజైన్ పేటెంట్ ఫైల్ చేసిన ఈ కంపెనీ, ఇప్పుడు దేశీయ రోడ్లపై కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీని టెస్ట్ చేయడం ప్రారంభించింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, లిమో గ్రీన్ అనే పేరుతో పిలవబడుతున్న ఈ కారు భవిష్యత్తులో కియా కారెన్స్ క్లావిస్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే సామర్థ్యం, 450 కి.మీ. రేంజ్‌తో రానున్న ఈ కారు వివరాలు చూద్దాం.
విన్‌ఫాస్ట్ కంపెనీ భారత మార్కెట్లోకి రావడానికి చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తమ కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ లిమో గ్రీన్‌ను భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేయడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన స్పై షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారు డిజైన్ వయత్నాంలో విడుదలైన లిమో గ్రీన్‌ను పోలి ఉంది. ఇందులో పొడవైన బాడీ స్టైల్, స్ట్రెయిట్-లైనర్ టెయిల్ లైట్స్, పెద్ద కిటికీలు కనిపిస్తున్నాయి. సైడ్ నుంచి చూసినప్పుడు ఈ కారు మూడు-రో లేఅవుట్ కలిగి ఉందని స్పష్టమవుతోంది. ఇది కుటుంబ అవసరాలు, ఎక్కువ స్థలం కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని తయారు చేసింది.
విండ్‌షీల్డ్ లోపల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపించడం ద్వారా ఈ మోడల్ టెస్టింగ్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని తెలుస్తోంది. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ కారును భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారు చేస్తోంది. దీని పవర్ట్రెయిన్ , రేంజ్ వివరాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కారులో 60.1 kWh బ్యాటరీ ప్యాక్, 201 bhp పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఇచ్చారు. ఇది 280 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ కారు.
దీని రేంజ్ సుమారు 450 కి.మీ వరకు ఉంటుందని అంచనా. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా దీని బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 10% నుండి 70% వరకు ఛార్జ్ చేయవచ్చు, ఇది ప్రయాణంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లిమో గ్రీన్ మోడ్రన్ క్యాబిన్ డిజైన్‌తో వస్తుంది. భారతదేశంలో విడుదల కాబోయే మోడల్‌లో కూడా ఇదే రకమైన ఫీచర్లు ఉండవచ్చు. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, లెదర్ తరహా సీట్లు, 360-డిగ్రీ కెమెరా, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు లభించే అవకాశం ఉంది.
ఈ కారు పొడవు దాదాపు 4.74 మీటర్లు, వీల్‌బేస్ 2,840 మిమీ గా ఉంది. ముఖ్యంగా దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ వరకు ఉంటుందని తెలుస్తోంది, ఇది భారతీయ రోడ్లకు చాలా అనుకూలం. భారత్‌లో విడుదలైన తర్వాత, విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ కొన్ని ప్రీమియం ఎలక్ట్రిక్ 7-సీటర్ కార్లతో పోటీ పడనుంది. ఇది ప్రధానంగా బివైడి ఈమాక్స్ 7, కియా కారెన్స్ క్లావిస్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుంది.
దీని పెద్ద పరిమాణం, మంచి రేంజ్, ఫీచర్ల కారణంగా ఇది ప్రీమియం కుటుంబ వినియోగదారులకు, పెద్ద ఈవీలను కోరుకునే ఫ్లీట్ ఆపరేటర్లకు బాగా నచ్చే అవకాశం ఉంది. విన్‌ఫాస్ట్ ఇటీవల తమిళనాడులో తమ మొదటి ఇండియన్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. లిమో గ్రీన్ ఈ ప్లాంట్ నుండి ఉత్పత్తి అయ్యే మొదటి మోడల్‌లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంది.