Xiaomi : షియోమీ నుంచి అదిరిపోయే లగ్జరీ హైబ్రిడ్ ఎస్‌యూవీ.. కారులోనే బెడ్‌రూమ్, ఆఫీస్ స్పేస్

కారులోనే బెడ్‌రూమ్, ఆఫీస్ స్పేస్

Update: 2026-07-15 04:23 GMT

Xiaomi : స్మార్ట్‌ఫోన్లు, విభిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చైనా దిగ్గజ సంస్థ షియోమీ ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ సెడాన్ ఎస్‌యూ7, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వైయూ7 మోడళ్లను సక్సెస్‌ఫుల్‌గా మార్కెట్లోకి తెచ్చిన ఈ సంస్థ, తాజాగా తన మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీని అధికారికంగా పరిచయం చేసింది. ఈ సరికొత్త లగ్జరీ కారుకు స్కైఅడ్వెంచర్ ఎన్‌90 అని పేరు పెట్టారు. షియోమీ సబ్-బ్రాండ్ అయిన స్కైఅడ్వెంచర్ కింద దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి ఈ కార్ల విక్రయాలు కేవలం చైనా మార్కెట్‌కే పరిమితం కాగా, దీనిలో ఉన్న వినూత్న ఫీచర్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

మొబైల్ మీటింగ్ రూమ్‌లా మారే ఇంటీరియర్

స్కైఅడ్వెంచర్ ఎన్‌90 అనేది లాంగ్ జర్నీలను అత్యంత సౌకర్యవంతంగా మార్చేలా రూపొందించబడిన ఒక ఫుల్-సైజ్ లగ్జరీ ఎస్‌యూవీ. ఈ కారులో అమర్చిన వినూత్నమైన ఫీచర్లు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఇందులో వెనుక సీట్ల వైపు తిప్పుకునే వీలున్న ఫ్రంట్ సీట్లు, అవసరమైనప్పుడు మడతపెట్టుకునే పెద్ద కాఫీ టేబుల్, ప్రయాణంలో అలసిపోతే హాయిగా పడుకోవడానికి వీలుగా బెడ్ లాంటి స్పేస్‌ను కూడా అందించారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, అవసరమైనప్పుడు ఈ కారును ఒక చిన్న ఆఫీస్ క్యాబిన్‌లా లేదా విశ్రాంతి తీసుకునే బెడ్‌రూమ్‌లా మార్చేసుకోవచ్చన్నమాట.

టీ-షేప్ ఎల్‌ఈడీ లైట్లు, 21 ఇంచుల అలాయ్ వీల్స్

రూపకల్పన పరంగా ఈ ఎస్‌యూవీ చాలా పెద్దదిగా, రోడ్డుపై అద్భుతమైన ప్రెజెన్స్‌తో కనిపిస్తుంది. ఈ కారు పొడవు 5,285 మిల్లీమీటర్లు, వెడల్పు 1,998 మిల్లీమీటర్లు, ఎత్తు 1,825 మిల్లీమీటర్లుగా ఉంది. అలాగే కారు వీల్‌బేస్ 3,080 మిల్లీమీటర్లుగా ఉండటంతో లోపల చాలా విశాలమైన స్థలం లభిస్తుంది. సుమారు 2.8 టన్నుల బరువుండే ఈ లగ్జరీ కారుకు 21 ఇంచుల భారీ అలాయ్ వీల్స్ అమర్చారు. కారు ముందు భాగంలో టీ-షేప్లో ఉండే ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, పెద్ద ఫ్రంట్ గ్రిల్, బాక్సీ డిజైన్ మరియు వెనుక వైపు ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఇచ్చారు. కారు విండ్‌షీల్డ్ పైభాగంలో ఆధునిక సేఫ్టీ సిస్టమ్ అడాస్ కు సంబంధించిన సెన్సార్లను కూడా అమర్చారు.

లగ్జరీ లాంజ్‌లా మారే కారు క్యాబిన్

ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్ అత్యంత ప్రీమియం లుక్‌తో, ఒక లగ్జరీ లాంజ్‌ను తలపిస్తుంది. భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం లెదర్ సీట్లు, సరికొత్త సన్‌రూఫ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ కారు 5-సీటర్, 7-సీటర్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 5-సీటర్ మోడల్‌లో మూడో వరుస సీట్లకు బదులుగా, ముందు వెనుక సీట్ల మధ్యలో ఫోల్డింగ్ కాఫీ టేబుల్‌ను అమర్చుకునే సదుపాయం ఉంటుంది. అదే 7-సీటర్ మోడల్‌లో రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు లభిస్తాయి, వీటిని మనకు నచ్చినట్లు ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారు సీట్లను పూర్తిగా ఫోల్డ్ చేయడం ద్వారా ప్రయాణంలో పడుకోవడానికి వీలుగా బెడ్ సెట్టింగ్ చేసుకోవచ్చు.

420 హార్స్‌పవర్, 370 కిలోమీటర్ల రేంజ్

సాంకేతిక వివరాల్లోకి వెళ్తే.. స్కైఅడ్వెంచర్ ఎన్‌90 కారులో రేంజ్-ఎక్స్‌టెండర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇందులో 76 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల బ్యాటరీతో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇవి రెండు కలిసి కారుకు ఏకంగా 420 హార్స్‌పవర్ శక్తిని అందిస్తాయి. ఈ కారు గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లు. కేవలం బ్యాటరీ పవర్‌తోనే ఈ కారు 370 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోగానే ఇందులోని 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. ఈ ఇంజన్ కారు చక్రాలను తిప్పడానికి కాకుండా, బ్యాటరీని ఛార్జ్ చేయడానికి అవసరమైన కరెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అత్యాధునిక టెక్నాలజీ వల్ల కారు లీటరుకు సుమారు 15.9 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

Tags:    

Similar News