Yezdi Roadster 2025 : రాయల్ ఎన్ ఫీల్డ్‌కు పోటీగా సరికొత్త యెజ్డీ రోడ్ స్టర్ లాంచ్.. ఫీచర్లు ఇవే
సరికొత్త యెడ్జీ రోడ్ స్టర్ లాంచ్.. ఫీచర్లు ఇవే
Yezdi Roadster 2025 : భారత మార్కెట్‌లోకి సరికొత్త యెజ్డీ రోడ్‌స్టర్ 2025 బైక్ వచ్చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.10 లక్షలు. ఈ కొత్త మోడల్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు, అదనపు ఫీచర్లను జోడించారు. దీంతో బైక్ మరింత ప్రీమియంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పాత క్లాసిక్ స్టైల్‌ను అడ్వాన్సుడ్ ఫీచర్లతో కలిపి ఈ బైక్‌ను డిజైన్ చేశారు. కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ 2025 డిజైన్ క్లాసిక్ బైక్ స్టైల్‌ను పోలి ఉంటుంది. ఇందులో రౌండ్ LED హెడ్‌లైట్, కొత్త కౌల్, కన్నీటి బిందువు ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, వంపులు తిరిగిన ఫెండర్లు, సన్నని టెయిల్ ల్యాంప్‌లు వంటివి ఉన్నాయి. ఈ బైక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ఫ్యాక్టరీ కస్టమ్ కిట్స్ అనే ఆప్షన్‌ను కూడా ఇచ్చారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ టెయిల్‌లైట్, టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్-టోన్ కలర్, హైడ్రోఫార్మ్డ్ హ్యాండిల్‌బార్, రిమూవబుల్ పిలియన్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ బైక్ స్టీల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్సార్బర్స్ సస్పెన్షన్ సౌకర్యం ఉంది. బైక్‌కు ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు చక్రానికి 320ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి 240ఎంఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి. దీనివల్ల బైక్ రైడింగ్‌లో మంచి సేఫ్టీ, కంట్రోల్ లభిస్తుంది.
యెడ్జీ రోడ్‌స్టర్ 2025 బైక్‌లో 334 సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 28.6 బీహెచ్‌పీ పవర్, 30 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంది. అంతేకాకుండా, ఇందులో ఉన్న అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ సిస్టమ్ వల్ల గేర్ షిఫ్టింగ్ చాలా సులభంగా, స్మూతుగా ఉంటుంది. యెడ్జీ సంస్థ ఈ బైక్‌పై 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని అందిస్తోంది. బైక్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే డెలివరీలు మొదలవుతాయి. రెట్రో డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్ల కలయిక ఉన్న బైక్ కావాలంటే యెజ్డీ రోడ్‌స్టర్ 2025 ఒక మంచి ఆప్షన్ కావచ్చు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.10 లక్షల నుంచి మొదలవుతుంది.