8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఒక ఊహించని శుభవార్త అందే అవకాశం ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఉద్యోగ సంఘాలు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత నిబంధనలను పక్కనపెట్టి, కుటుంబ సభ్యుల సంఖ్యను పెంచి లెక్కించాలని కోరుతున్నాయి. ఈ డిమాండ్ గనుక నెరవేరితే ఉద్యోగులు అలాగే పెన్షనర్ల మూల వేతనం అమాంతం పెరగనుంది.

ఇంతవరకు వేతన సంఘం కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు కుటుంబంలో కేవలం 3 యూనిట్లను మాత్రమే పరిగణలోకి తీసుకునేది. ఇందులో ఉద్యోగి, భార్య లేదా భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉండేవారు. అయితే ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జేసీఎం అలాగే భారత్ పెన్షనర్స్ సమాజ్ ఒక సరికొత్త ప్రతిపాదనను కమిషన్ ముందుంచాయి. ఈ గణనలో వృద్ధ తల్లిదండ్రులను కూడా భాగం చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. భారతదేశంలో ఏ ఉద్యోగైనా కేవలం పిల్లలను మాత్రమే కాకుండా వృద్ధులైన తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలా చూసుకుంటాడు. చట్టపరంగా కూడా తల్లిదండ్రుల బాధ్యత పిల్లలపైనే ఉంటుంది.

ఉద్యోగ సంఘాలు వేతన సంఘానికి సమర్పించిన విజ్ఞాపన పత్రంలో జీతం లెక్కించడానికి ఒక కొత్త ఫార్ములాను రూపొందించాయి. దీని ప్రకారం ఉద్యోగిని 1.0 యూనిట్‌గా, భార్య లేదా భర్తను 1 యూనిట్‌గా పరిగణించాలి. ఇద్దరు పిల్లలకు కలిపి 1.6 యూనిట్లు కేటాయించగా, తల్లిదండ్రులు ఇద్దరికీ కలిపి మరో 1.6 యూనిట్లు కేటాయించారు. వీటన్నింటినీ కలిపితే మొత్తం 5.2 యూనిట్లు అవుతాయి. దీన్ని రౌండ్ ఫిగర్‌గా 5 యూనిట్లుగా పరిగణించి సరికొత్త వేతనాన్ని నిర్ణయించాలని యూనిట్లు స్పష్టంగా కోరుతున్నాయి.

వేతన సంఘం ఈ 5 యూనిట్ల కొత్త ఫార్ములాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే జీతాల లెక్కింపు పూర్తిగా మారిపోతుంది. ఐదుగురు సభ్యుల కుటుంబానికి కేవలం రేషన్ ఖర్చుల కిందనే సుమారు రూ.24,443 వరకు ఖర్చవుతుందని అంచనా. దీనికి ఇల్లు అద్దె, కరెంట్ బిల్లులు, పండుగ ఖర్చులు, ఇతర అవసరాలను జోడిస్తే కనీస వేతనం దాదాపు రూ.68,947 వరకు వస్తుంది. దీన్ని సుమారు రూ.69,000గా లెక్కగట్టవచ్చు. ద్రవ్యోల్బణం వేగాన్ని బట్టి భవిష్యత్తులో ఈ కనీస వేతనం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత విధానంలో అలవెన్సులపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని, బేసిక్ పే తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగ విరమణ తర్వాత తీవ్ర నష్టం జరుగుతోందని రైల్వే సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గ్రాట్యుటీతో పాటు పెన్షన్ మొత్తం కూడా పూర్తిగా బేసిక్ పే పైనే ఆధారపడి ఉంటుంది. ఎనిమిదవ వేతన సంఘం ఈ ఐదు యూనిట్ల డిమాండ్‌ను అంగీకరిస్తే కేవలం ప్రస్తుత ఉద్యోగులకే కాకుండా పాత పెన్షనర్ల పింఛన్లలో కూడా భారీ పెరుగుదల కనిపిస్తుంది.

Tags: